Lok Sabha Elections 2024: మార్చి 19వ తేదీన కాంగ్రెస్ మేనిఫెస్టో! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ
Lok Sabha Elections 2024: ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని ఫైనలైజ్ చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని ఫైనలైజ్ చేసే పనిలో (Congress Manifesto 2024) నిమగ్నమైంది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలు విడుదల చేసింది. అదే సమయంలో మేనిఫెస్టోపైనా పూర్తిస్థాయిలో మేధోమథనం జరుపుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తరవాతే కాంగ్రెస్ అధికారికంగా మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహాలనూ వెల్లడించనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ప్రచార వ్యూహాలపైనా ఓ స్పష్టతనివ్వనుంది. అభ్యర్థుల ఎంపిక, విధానాల్లో సంస్కరణలు, సంస్థాగత మార్పులు లాంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఈ భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక I.N.D.I.A కూటమిలో అన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి దూరం అవుతున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని NDAని ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఒకేతాటిపై ఉండాలని చెబుతోంది. కానీ...అంతర్గతంగా కూటమిలో ఇప్పటికే విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కాంగ్రెస్ మాత్రం మేనిఫెస్టోపైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని పంచ న్యాయ్ హామీలను సిద్ధం చేసింది. కర్ణాటక, తెలంగాణలో ఇదే ఫార్ములా వర్కౌట్ అవడం వల్ల దేశవ్యాప్తంగా ఇదే అమలు చేయాలని చూస్తోంది.
Congress Working Committee meeting to be held in Delhi on March 19 to finalise the manifesto for Lok Sabha polls and discussion on strategy for the elections pic.twitter.com/eo45mg75Vv
— ANI (@ANI) March 16, 2024
అటు రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో న్యాయ్ యాత్రని కొనసాగిస్తున్నారు. మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని మండి పడుతున్నారు. ఇప్పటికే అదానీ వ్యవహారంపై ఆయన గట్టిగానే మాట్లాడారు. మణిపూర్ అల్లర్లపైనా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అయితే...భారత్ జోడో యాత్రకి వచ్చిన స్థాయిలో భారత్ జోడో న్యాయ్ యాత్రకి రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. పైగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి ఇది పెద్ద షాక్ ఇచ్చింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అలా చతికిలబడకుండా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకే...మేనిఫెస్టోపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రియాంక గాంధీ కూడా ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నేతలంతా లెక్కలు వేసుకుని ఈ హామీ పత్రానికి ఆమోదం వేయనున్నారు. ఆ తరవాత కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుంది. మార్చి 19వ తేదీనే ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు