Lok Sabha Elections 2024: అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై నిఘా, బ్యాంక్‌లకు ఈసీ కీలక ఆదేశాలు
Lok Sabha Elections 2024: అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై నిఘా పెడతామని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
Lok Sabha Elections 2024 Schedule: కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో సీఈసీ రాజీవ్ కుమార్ పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెడతామని తేల్చి చెప్పారు. ఓ సంచలన ప్రకటన కూడా చేశారు. లావాదేవీలపై నిఘాలో భాగంగా బ్యాంక్‌లన్నింటికీ రోజువారీ Suspicious Transaction Reports (STR)లు సమర్పించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. అనుమానిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంక్‌లు ఈసీకీ వెల్లడించాలని రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ధనబలాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యం అని వెల్లడించారు.
"ఒక్కో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒక్కో విధంగా బలప్రదర్శన చేస్తాయి. ఈ విషయం మాకూ తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో ధన ప్రవాహం అనూహ్య రీతిలో ఉంటుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు బల ప్రదర్శన చేస్తుంటాయి. వీటిపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను గమనిస్తుంటాం. GST, NPCI లాంటి సంస్థలు, ఇతరత్రా ఏజెన్సీలు, బ్యాంక్‌లు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై తప్పకుండా నిఘా పెడతాయి"
- రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంచడం, ఉచిత హామీలివ్వడం, డ్రగ్స్ సరఫరా చేయడం లాంటి వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని ఈసీ స్ఫష్టం చేసింది. ఇష్టారీతిన ఉచితంగా ఏది పడితే అది పంపిణీ చేయడాన్నీ అడ్డుకుంటామని తేల్చిచెప్పింది. ఇందుకోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నట్టు తెలిపింది. అటు ఆన్‌లైన్‌లో జరిగే నగదు బదిలీలపైనా నిఘా పెట్టనుంది. సూర్యాస్తమయం తరవాత బ్యాంక్‌లకు సంబంధించిన క్యాష్ వ్యాన్‌లూ తిరిగేందుకు వీల్లేకుండా ఈసీ ఆంక్షలు విధించింది. నాన్ షెడ్యూల్డ్ ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో తనిఖీలు చేపట్టనుంది.