Mohammed Faizal: అనర్హత వేటు నుంచి బయట పడ్డ ఎన్‌సీపీ ఎంపీ, రాహుల్ లీగల్ టీమ్‌కి దారి దొరికినట్టేనా?
Mohammed Faizal: అనర్హతా వేటుకు గురైన ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
Mohammed Faizal:
లక్షద్వీప్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. రాహుల్ లాగానే...తన ఎంపీ పదవిని కోల్పోయిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ మళ్లీ ఆ పదవిని సంపాదించుకున్నారు. న్యాయ పోరాటం చేసి అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ లీగల్ టీమ్...ఇదే కేసుని ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా లోక్‌సభ సభ్యత్వాన్ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. రాహుల్ న్యాయ పోరాటం చేసేందుకు 30 రోజుల గడువునిచ్చింది సూరత్ కోర్టు. ఈ లోగా ఏదోటి తేల్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇంత కీలక సమయంలో ఫైజల్ సభ్యత్వం రీస్టోర్ అవడం ఆసక్తికరంగా మారింది. ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై ఓ హత్యా కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. వెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దైంది. అయితే..జనవరిలో కేరళ హైకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఫైజల్...లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి దిగారు. 2009లో కేంద్ర మంత్రి పీఎమ్ సయ్యీద్ హత్య కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని వాదించారు ఫైజల్. తనపై 2016లో నమోదైన కేసునీ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అని తేల్చి చెప్పారు. అయితే...ఈ కేసు విచారణలో ఉండగానే 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు మహమ్మద్ ఫైజల్. ఈ ఏడాది జనవరి 11న...ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రెండ్రోజుల తరవాత లోక్‌సభ సెక్రటేరియట్ ఫైజల్‌పై అనర్హతా వేటు వేశారు.
ఉప ఎన్నిక రద్దు..
లక్షద్వీప్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజల్‌పై అనర్హతా వేటు పడడం వల్ల ఆ సీటు ఖాళీ అయింది. వెంటనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. జనవరి 27న ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది. సరిగ్గా ఈ ఎన్నికకు రెండ్రోజుల ముందే కేరళ హైకోర్టు...ఈ తీర్పుని సస్పెండ్ చేసింది. ఉప ఎన్నిక నిర్వహించకుండా ఈసీకి ఆదేశాలు పంపింది. జనవరి 30వ తేదీన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆ తరవాత సభ్యత్వాన్ని రీస్టోర్ చేస్తూ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్‌పై అనురాగ్ ఫైర్..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తే...ఆయన తరపున వాదించేందుకు ఆ పార్టీలోని ఏ ఒక్క న్యాయవాది కూడా ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. అంతే కాదు. రాహుల్‌పై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదని, ఆయనపై 7 పరువు నష్టం దావా కేసులున్నాయని అన్నారు. వాటిపై పలు కోర్టుల్లో విచారణ జరుగుతోందని వెల్లడించారు. పార్లమెంట్ నుంచి ఆయనను తప్పించడంలో కేంద్రానికి, లోక్‌సభ సెక్రటేరియట్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతనిధ్య చట్ట ప్రకారమే ఆయనపై అనర్హతా వేటు వేశారని అన్నారు.
"కాంగ్రెస్‌లో ఎంతో మంది గొప్ప న్యాయవాదులున్నారు. వాళ్లకు అధిష్ఠానం రాజ్యసభ ఎంపీలుగా అవకాశమిచ్చింది. ఇప్పుడు రాహుల్‌పై అనర్హతా వేటు పడితే..వారిలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయనను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ఇది రాహుల్‌పై జరుగుతున్న కుట్ర అనుకోవాలా..? పవన్ ఖేరాకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఆ లాయర్‌లు అందరూ ముందుకొచ్చి ఆయనను కాపాడారు. మరి రాహుల్ గాంధీ విషయంలో వాళ్లెందుకు మౌనంగా ఉన్నారు..? రాహుల్‌పై కుట్ర చేస్తున్న వారెవరో..? ఇదో అంతుచిక్కని ప్రశ్న"
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి
Also Read: Rahul Gandhi: అనర్హతా వేటు తరవాత తొలిసారి పార్లమెంట్‌కు రాహుల్, ఆ మీటింగ్ కోసమేనట!