70 ఏళ్ల కుర్రాడు- చెట్టులెక్కగలడు- చిటారు కాయలు దించగలడు!
Konaseema News: ఏడుపదుల వయసులోనూ ఆ వృద్ధుడు అవలీలగా చెట్లు ఎక్కేస్తున్నాడు. వందలాది మంది ఉపాధిని చూపించిన షేశగిరి ఇటీవలే కేరళలో జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.
Konaseema News: వేగంగా మారుతున్న కాలంలో మనిషి ఆయువు కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. సగటు మనిషి ఆయుష్కాలం ప్రస్తుతం 70 నుంచి 80 ఏళ్లు అని వైద్య నిపుణలు ఘంటాపథంగా చెబుతున్నారు. అదికూడా అనేక రోగాలతో కాలం వెళ్లదీయాల్సిన దుస్ధితి. అయితే కొందరు మాత్రం మాకు వయసుతో పని లేదు, మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మేం చాలా బలవంతులం అని నిరూపిస్తున్నారు. అలాంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
కొనసీమ అంటే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడ కేరళను తలపించేలా కొబ్బరి తోటలు కనిపిస్తాయి. కొబ్బరి తోటల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇక్కడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అంతే కాదండోయ్ అనేక కొబ్బరి ఉత్పత్తులకు కోనసీమ పెట్టింది పేరు. అయితే వచ్చిన సమస్య ఏంటంటే... దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉండే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలను దించే కార్మికులు తగ్గిపోవడం కొబ్బరి రైతులకు పెద్ద సమస్యగా మారింది. కొబ్బరి చెట్టు ఎక్కాలన్నా, దిగాలన్నా మనిషి ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. పూర్వ కాలంలో నడుముకు మోకు కట్టుకుని చెట్లు ఎక్కి కొబ్బరి దింపు తీసేవారు. ఇది చాలా శ్రమతో కూడిన పని కాగా అంత సురక్షితం కూడా కాదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్న కేరళలోని కొబ్బరి పరిశోధన సంస్థ నిపుణులు ఒక సాధనాన్ని ప్రయోగాత్మకంగా రూపకల్పన చేశారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో స్థానికంగా ఉన్న అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం వారుకూడా చొరవ చూపి అక్కడినుంచి నిపుణలను రప్పించి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. దీంతో ఇక్కడ కూడా క్లైంబర్ పరికరంతో దింపులు తీయడం ప్రారంభించారు.
60 ఏళ్లలో ఆసక్తి కలిగి ప్రయత్నిస్తే...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్లంక గ్రామానికి చెందిన గిడుగు శేషగిరిరావు వయస్సు అప్పటికి అరవై ఏళ్లు. ఏదో పనిచేసుకుని జీవనం సాగించే అలవాటు ఉండడంతో చాలా చురుగ్గా ఉండేవారు. దింపునకు సంబందించి శిక్షణ ఇస్తున్నారని తెలిసి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించారు. అయితే వారు ఈ వయస్సులో చెట్లు ఎక్కడమేంటని తిరస్కరించారు. అయినా పట్టు వదలకుండా తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అవకాశం కల్పించాలని పట్టుపట్టడంతో శిక్షణ ఇచ్చారు. అంతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజూ సుమారు 80 కొబ్బరి చెట్లు అవలీలగా ఎక్కి దిగేస్తుంటారు శేషగిరిరావు.
ఎంతో మందికి ఆదర్శంగా..
గ్రామంలో ఎంతో మంది యువకులు ఏ పనీ లేక ఖాళీగా ఉండటాన్ని గమనించిన శేషగిరిరావు వారందరికీ తానే శిక్షణ ఇచ్చి చెట్లు ఎక్కే పరికరాన్ని ఇప్పించారు. కోనసీమలో దాదాపు 500 మంది పైబడి దింపు తీసే కార్మికులు ఈయన శిష్యులే. వారంతా శేషగిరిరావును మా కుర్రోడు అంటుంటారు. దీనికి ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుతుంటాడు. ఓపిక ఉన్నంత కాలం ఏదో ఒక పని చేసుకుని జీవించాలని, అంతే కానీ సోమరితనంలా ఉండిపోకూడదని స్థానిక యువకులకు నాలుగు మంచి మాటలు నూరిపోస్తూ ఉంటారు శేషగిరిరావు.
నేటికీ అంతే ఉత్సాహంగా..
శేషగిరిరావు వయస్సు ఇప్పుడు 70 ఏళ్లు దాటాయి. అయినా కుర్రాళ్లతో పోటీపడి మరీ చెట్లు అవలీలగా ఎక్కేస్తుంటారు. కేరళలో ఆ రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు శేషగిరిరావు. ఇప్పటి వరకు తన దగ్గర సుమారు 900 మంది వరకు శిక్షణ తీసుకున్నారని, వారంతా ఇప్పుడు సురక్షితమైన విధానంలో కొబ్బరి దింపు కార్మికులుగా గోదావరి జిల్లాల్లో ఉపాధిని పొందుతున్నారని శేషగిరిరావు చెబుతున్నారు.