(Source: ECI/ABP News/ABP Majha)
Komatireddy Vs Jagadish Reddy: కేసీఆర్ తర్వాత జైలుకు వెళ్లేది ఆ మాజీ మంత్రే - కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jagadish Reddy News: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కోమటిరెడ్డిని కాంగ్రెస్‌లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటుంటారని జగదీష్ రెడ్డి చెప్పారు.
Komatireddy Venkat Reddy Vs Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాట యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే అయిన జగదీశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేయగా.. దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా వారు ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తాము ప్రశ్నిస్తే.. అసహనానికి గురవుతున్నారని అన్నారు.
అది కోమటిరెడ్డి తాతతరం కూడా కాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కోమటిరెడ్డిని కాంగ్రెస్‌లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటుంటారని జగదీష్ రెడ్డి చెప్పారు. గత మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీజేపీ నుంచి పోటీ చేసిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పని చేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడేమో బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తా అని మాట్లాడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్‌ను ముక్కలు చేయడం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాతతరం కూడా కాదని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి నిమిషానికో మాట మార్చుతూ ఉంటారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తర్వాత జైలుకు వెళ్లేది జగదీష్ రెడ్డే..
జగదీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీష్ రెడ్డే అంటూ కోమటిరెడ్డి అన్నారు. మేడిగడ్డ విషయంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. విజిలెన్స్ విచారణను, సిట్టింగ్ జడ్జితో విచారణను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఒకప్పుడు ప్యారగాన్ స్లిప్పర్లు వేసుకుని తిరిగిన వ్యక్తి జగదీష్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తికి ఇప్పుడు రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో బావా, బామ్మర్దులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందులో జగదీష్ రెడ్డి బ్రోకర్‌లాగా వ్యవహరించారని వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటానని.. అలాంటి తనపై జగదీష్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తి ఆరోపణలు చేయడం విచిత్రం అని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తాను త్రుణప్రాయంగా విసిరికొట్టానని గుర్తు చేశారు. కానీ జగదీష్ రెడ్డి మంత్రి పదవి కోసం కేసీఆర్ ఆడించినట్లు ఆడాడని అన్నారు. నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారని అన్నారు.