Virus Outbreak in Kerala: వైరస్‌లకు కేరళ ఎందుకు హాట్‌స్పాట్‌గా మారుతోంది? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు?
Virus Outbreak in Kerala: ఎబోలా, జికా, నిఫా, కొవిడ్..ఇలా అన్ని వైరస్‌లకు కేరళ హాట్‌స్పాట్‌గా మారుతోంది. అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
డెంగ్యూ నుంచి మంకీపాక్స్ వరకూ కేరళలోనే..
భారత్‌లో ఇప్పటికే ఏడుగురు మంకీపాక్స్ బారిన పడగా, కొత్తగా మరొకరికి ఈ వైరస్ సోకింది. కేరళలోనే దాదాపు ఐదు కేసులు నమోదయ్యాయి. దిల్లీలో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశ రాజధానిలోనూ మంకీపాక్స్ కలవరపెడుతున్నా..అందరి చర్చ మాత్రం కేరళ గురించే. మంకీపాక్స్ బారిన పడి మృతి చెందిన వ్యక్తి..కేరళ వాసి కావడమే ఇందుకు కారణం. ఇప్పుడే కాదు. అసలు ఏ వైరస్ వ్యాప్తి చెందినా సరే..హాట్‌స్పాట్‌గా నిలుస్తుంది కేరళ. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది ఇక్కడే. ఈ వ్యాధి మాత్రమే కాదు. గతంలో వచ్చిన ఎన్నో ఎపిడెమిక్స్ (Epidemics)కేరళను కలవరపెట్టాయి. డెంగ్యూ, చికున్ గున్యా, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్, వెస్ట్ నైల్ ఫివర్, H1N1,నిఫా, ఆంత్రాక్స్ సహా కొవిడ్. ఈ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు కేరళలో చాలా మంది ఈ వ్యాధుల బారిన పడ్డారు. ఇప్పుడు మంకీపాక్స్ విషయంలోనూ ఇదేజరుగుతోంది.
ఎప్పుడెప్పుడు ఏ వైరస్..?
చికున్ గున్యాతో పాటు జపనీస్ ఎన్‌సెఫాలిటిస్, అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్ సిండ్రోమ్, స్వైన్‌ఫ్లూ కూడా కేరళను వణికించాయి. మంకీపాక్స్‌కు ముందు ఈ రాష్ట్రంలో జికా వైరస్, ఆంత్రాక్స్ కేసులూ నమోదయ్యాయి. దాదాపు అన్ని ఎపిడమిక్స్ మొదలైంది కేరళలోనే. కొవిడ్ వైరస్ కూడా మొదట కేరళలోనే వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కేసులు పెరగటం వల్ల వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై, కట్టడి చర్యలు మొదలు పెట్టింది. ఇక్కడే వైరస్ వ్యాప్తి మొదలైనప్పటికీ, అక్కడి ప్రభుత్వం దీన్ని అడ్డుకోవటంలో సక్సెస్ అయింది. టెస్టింగ్, ట్రేసింగ్‌ను పకడ్బందీగా నిర్వహించి కొద్ది రోజుల్లోనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చింది. కానీ...తగ్గినట్టే తగ్గి, మళ్లీ కేసులు అనూహ్యంగా పెరిగాయి. జులైలోనే నాలుగు రెట్లు ఎక్కువగా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇక గతేడాది సెప్టెంబర్‌లో కేరళలో 12 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకింది. చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్‌పై దృష్టి సారించింది. బాలుడితో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరినీ గుర్తించి టెస్ట్ చేయగా నెగటివ్‌గా తేలింది. ఈ సమయంలోనే అధికారులు ఊపిరి సలపకుండా పని చేశారు.
2018లో 18 మంది నిఫా వైరస్ బారిన పడగా, 17 మంది మృతి చెందారు. అలాంటి విపత్తు మరోసారి ముంచుకొస్తుందేమో అని ప్రభుత్వం భయపడినా, అలాంటిదేమీ జరగలేదు. అయితే కొవిడ్ కారణంగా మళ్లీ ప్రజలు ఆందోళనకు గురి అవ్వాల్సి వచ్చింది. గతేడాది నిఫా మాత్రమే కాదు. జికా వైరస్ కూడా దాడి చేసింది. 66 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది తిరువనంతపురానికి చెందిన వాళ్లే. స్క్రీనింగ్, టెస్టింగ్‌ను పక్కాగా నిర్వహించటం వల్ల తొందర్లోనే ఆ వైరస్‌ను కూడా కట్టడి చేయగలిగారు. ఈ ఏడాది జూన్‌లో ఆంత్రాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. రెండేళ్లుగా వరసగా వైరస్‌లు కేరళపై దాడి చేశాయి.
కేరళలోనే ఎందుకిలా..?
కేరళ ఎందుకిలా హాట్‌స్పాట్‌గా మారుతోంది..? అంటే ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువగా ఉండటం వల్ల. చాలా దేశాల్లో కేరళ వాసులు నివసిస్తున్నారు. కేరళకు చెందిన వైద్యులు, నర్సులు చాలా మంది పలు దేశాల్లో పని చేస్తున్నారు. కేరళకు చెందిన విద్యార్థులు
మెడికల్ కోర్సుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వాళ్లే ఎక్కువగా వైరస్‌ల బారిన పడుతుంటారు. వాళ్లు కేరళకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతోంది. నేచర్ జర్నల్ వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే...కేరళలో జనాభా సాంద్రత ఎక్కువ. అందుకే..ఏ వైరస్ అయినా తొందరగా వ్యాప్తి చెందుతుంది. కేరళలోని వెస్ట్రన్ ఘాట్స్‌ను ఆక్రమిస్తూ కొత్త కొత్త కట్టడాలువెలుస్తున్నాయి. వెస్ట్రన్ ఘాట్స్‌ను ఆవాసంగా చేసుకుని ఉండే జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.
ముఖ్యంగా గబ్బిలాలు ఎన్నో వైరస్ జబ్బులను మోసుకొస్తున్నాయి. సివెట్ క్యాట్స్ లాంటి జంతువులు కొన్ని దాదాపుగా జనావాసాల్లోకి వచ్చేశాయి. వాటి సహజ ఆవాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్యాట్‌లు జనావాసాల్లోకి రావటం వల్ల సార్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇక గబ్బిలాలు, నిఫా, ఎబోలా లాంటి వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలోని లోపాలు కూడా ఇలాంటి జబ్బులకు కారణమవుతున్నట్టు నిపుణులు కొందరు అంచనా వేస్తున్నారు.
Also Read: Monkeypox Virus: మంకీపాక్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి - కేంద్రం గైడ్‌లైన్స్ ఇవే
Also Read: School Bus Accident: స్కూల్ బస్సు బోల్తా, డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం!