KCR Jagan Meet : 45 నిమిషాల పాటు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు - రాజకీయాలపైనే ?
Jagan And KCR : కేసీఆర్ , జగన్ రాజకీయాలపై చాలా సేపు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పరామర్శ తర్వాత 40 నిమిషాలు ఇద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
KCR and Jagan held political talks : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో కేసీఆర్ ను పరామర్శించారు. తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు ఇరువురు రాజకీయ అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరూ లేకుండా వారిద్దరే పలు అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఉద్యమం సమయంలో జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన సమయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. జగన్ పరకాల పర్యటనకు వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.. తెలంగాణలోనూ ఆయన రాజకీయాలు చేస్తూండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా కేసీఆర్, జగన్ రాజకీయ స్నేహితులు అయ్యారు.
కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ స్నేహం
2018 ముందస్తు ఎన్నికల సమయంలో వైసీపీకి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా సహకరించింది. డేటా చోరీ వంటి కేసులు పెట్టడంతో పాటు.. టీడీపీకి ఆర్థికపరమైన వనరులు తెలంగాణ నుంచి అందకుండా చేయడంలో కేసీఆర్ సర్కార్ కీలక పాతర్ పోషించిందని చెబుతారు. అదే సమయంలో వైసీపీకి ఆర్థిక సాయం కూడా అందించారని అంటారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఆ తర్వాత కూడా భేటీలు జరిగాయి. కానీ గత రెండు, మూడేళ్లుగా నేరుగా సమావేశం కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు వచ్చినా నేరుగా జగన్ ఎప్పుడూ కల్పించుకోలేదు. రాజకీయ సంబంధాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీ సహకారం
ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలక పాత్ర పోషించారు.సర్వేలు, అభ్యర్థులు, అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయినా ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చింది. తాజా భేటీలో చెవిరెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ కేసీఆర్, జగన్ ముఖాముఖి చర్చలు జరిపిన సమయంలో పక్కన చెవిరెడ్డి కూడా లేనట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వ్యూహాలపై కేసీఆర్ చర్చించినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ తో భేటీ తర్వాత లోటస్ పాండ్ వెళ్లి విజయమ్మతో జగన్ భేటీ
మరో వైపు భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ లోటస్ పాండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ జగన్ తల్లి విజయమ్మ ఉండటంతో ఆమెతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో జగన్ విజయమ్మతో భేటీకి హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది.