Rohini, Roopa transferred : వాళ్లిద్దరికీ పోస్టింగ్‌లు లేకుండా బదిలీ - కర్ణాటక సర్కార్ చర్యలు!
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్న రోహిణి సింధూరి, రూపా ముద్గల్ లను పోస్టింగ్ లేకుండా కర్ణాటక సర్కార్ బదిలీ చేసింది.
Rohini, Roopa transferred : కర్ణాటకలో వ్యక్తిగత అంశాలపై సోషల్ మీడియాలో వాదులాటకు దిగి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూపా ముద్గల్ లను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరిద్దరి వ్యవహారంపై ముఖ్యమంత్రి బొమ్మై సీరియస్ అయ్యారు. వారిద్దరూ బాధ్యత గల సివిల్ సర్వీస్ అధికారులని ఇలా పరువు తీసుకునేలా వ్యవహరించడం ఏమిటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వారిని బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ స్థానంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్‌ప్రెన్యుర్ షిప్ అండ్ లైవ్లీ హుడ్ సంయుక్త కార్యదర్శి హెచ్ బసవరాజేంద్రను నియమించింది.
రోహిణి సింధూరిపై తీవ్ర ఆరోపణలు చేసి.. ఆమె వ్యక్తిగత వీడియోలు కూడా బయట పెట్టిన కర్ణాటక రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న డీ రూప ముద్గల్‌ను ప్రభఉత్వం ఆ హోదా నుంచి తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో డీ రూప భర్త, ఐఎఎస్ అధికారి మునీశ్ మౌద్గిల్ ను కూడా బదిలీ చేసింది .అయితే ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లేని సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది.
సివిల్ సర్వీస్ అధికారులు అయిన రూపా, రోహిణి మంచి మిత్రులని సమాచారం. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో వివాదం ప్రారంభమయింది. రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి డి.రూప.. ఇలాంటి చిత్రాలు మామూలుగా అనిపించవచ్చు. కానీ, ఒక మహిళా ఐఏఎస్ అధికారి ముగ్గురు మగ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒకరి నుంచి ఒకరికి ఇలా ఎన్నో ఫోటోలు తరచూ షేర్ చేస్తుంటే అర్థం ఏమిటి? ఇది ఆమె ప్రైవేట్ విషయం కాదు, ఐఏఎస్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం నేరం. ఏ దర్యాప్తు సంస్థ అయినా ఈ ఫోటోల వాస్తవికతను కూడా విచారణ చేయవచ్చు. కొందరికి ఇది మామూలుగా అనిపించవచ్చు. పంపిన సందర్భం మరోలా ఉంది"అని తన పోస్ట్‌లో డి.రూప తెలిపారు.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఎమ్మెల్యే సా.రా. మహేష్ ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? అని రూప ప్రశ్నించింది. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రోహిణి సింధూరి, రూపకు ఏ కారణం చేతనైనా ప్రజలకు, సోషల్ మీడియాకు లేదా మీడియాకు ప్రకటన చేయడానికి వీల్లేకుండా పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు బదిలీ చేసింది. ఈ ఇద్దరు అధికారుల్లో రోహిణి సింధూరి ఎక్కువ వివాదాస్పద అధికారిగా పేరు పొందారు.