Karnataka High Court: భరణమంటే పోషణ ఖర్చే- అలాంటి మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండొద్దు - కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Karnataka High Court: భరణం వస్తుందన్న కారణంతో భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. భర్త నుంచి భరణం పొందడానికి భార్య సరైన కారణం చూపాలని పేర్కొంది.
Karnataka High Court: ఉద్యోగం చేస్తూ భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు భరణం వస్తుందని ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు సూచించింది. భర్త నుంచి భరణం పొందడానికి భార్య సరైన కారణం చూపాలని పేర్కొంది. తన మెయింటనెన్స్ కోసం భార్య పూర్తిగా భర్తపైనే ఆధార పడకూడదని వెల్లడించింది. అప్పటి వరకు పని చేస్తున్న మహిళ పెళ్లైన తర్వాత ఖాళీగా కూర్చోకూడదని వివరించింది. భార్యా బిడ్డలకు భర్త అందించే జీవన భృతిలో కోత విధించడంపై దాఖలైన కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ఇవాల్సిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ తన భర్తపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా భార్య ఎందుకు పని చేయలేకపోతుందో తెలపాలని పిటిషనర్ కు కోర్టు ప్రశ్నించింది.
బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేకల్ పట్టణానికి చెందిన ఒక మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను న్యాయమూర్తి రాజేంద్ర బాదామికర్ విచారించారు. గతంలో ఉద్యోగం చేసిన భార్య.. పెళ్లైన తర్వాత నుంచి ఎందుకు ఉద్యోగం చేయలేకపోతుందో వివరణ ఇవ్వాలని కోరారు. భార్య తన ఖర్చులను తీర్చుకోవడానికి చట్టబద్ధంగా కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని.. అలాగే ఆమె భర్త నుంచి సహాయక పోషణను మాత్రమే పొందవచ్చని తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
గృహహింస మహిళల రక్షణ చట్టం 2005లోని సెక్షన్ -12 కింద దరఖాస్తు చేస్తూ... ఆ మహిళ, తన మైనర్ కుమారుడు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రొవిజన్స్ స్టోర్ నడుపుతున్న భర్త భార్యకు భరణంగా నెలకు 10 వేల రూపాయలు, కొడుకుకు నెలకు మరో 5 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే భార్యకు అతడు కల్గించిన మానసిక వేదనకు గాను ఆమెకు రూ.3 లక్షల పరిహారం అందజేయాలని తీర్పు ఇచ్చింది. అయితే మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇవాల్సిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ భార్య మరో పిటిషన్ వేసింది. సెషన్స్ (అప్పిలేట్ కోర్టు) కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ.10,000 నుంచి రూ.5,000లకు అలాగే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గించారు. ఈక్రమంలోనే ఆమెకు మంజూరు చేసిన పరిహారం సరిపోదని పిటిషనర్ వాదించారు. సరైన సాకు లేకుండా సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. భర్త ఇచ్చే భరణం పోషణ కోసమేనని... పూర్తి నిర్వహణకు కాదని అభిప్రాయపడింది. ఆయనకు ఉన్న తల్లీ, సోదరిని కూడా పోషించుకోవాల్సి ఉంటుందని అందుకే కోత విధించడాన్ని సమర్ధిస్తూ మహిళ పిటిషన్‌కు కొట్టేసింది.
Also Read: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు- సుప్రీంకోర్టులో పెరగనున్న తెలుగు జడ్జిల సంఖ్య
Also Read: సీఏ ఫలితాల్లో తెలుగు సత్తా, ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన సాయి శ్రీకర్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial