ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు- సుప్రీంకోర్టులో పెరగనున్న తెలుగు జడ్జిల సంఖ్య
వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఖాళీలపై ఫోకస్ పెట్టింది.
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సజెస్ట్ చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేయాల్సి ఉంది.
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం
వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఖాళీలపై ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను ఎంపిక చేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ, బొంబాయి, గుజరాత్, ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణకి కూడా సిఫార్సు
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీకే మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో ఖాళీ ఏర్పడింది. దీనికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమించాలని కొలీజియం సూచించింది. తెలంగాణకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరధేను సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయన 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
ఏపీ, తెలంగాణకు నియమించినట్టుగానే గుజరాత్‌కు సునీతా అగర్వాల్ అనే మహిళాన్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు. బొంబాయి హైకోర్టుకు జస్టిస్ దేవేంద్రకుమార్, మణిపూర్‌కు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, కేరళకు జస్టిస్ ఆశిష్ దేశాయ్, ఒడిశాకు జస్టిస్ సుబాసిస్ తలపత్రను ప్రధాన న్యాయమూర్తులుగా నియించాలని కొలీజియం సిఫార్సు చేసింది.
31 నుంచి 33కి
సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న మూడు ప్రధాన న్యాయమూర్తుల నియామక ప్రక్రియను కూడా కొలీజియం చేపట్టింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు బదులు ప్రస్తుతం 31 మంది ఉన్నారు. ఇప్పుడు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఇద్దరు న్యాయమూర్తులను కొలీజియం సూచించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్‌ను కొలీజియం పరిగణలోకి తీసుకుంది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2013 ఏప్రిల్ 12 నుంచి 2019 మార్చి వరకు సేవలు అందించారు. అప్పుడే కేరళకు బదిలీ అయ్యారు. అయితే 2023 జూన్ 1 నుంచి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ వెంకటనారాయణ భట్ నియామకం పూర్తైతే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో ముగ్గురు తెలుగువారు ఉన్నట్టు లెక్క. ప్రస్తుతం జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ సేవలు అందిస్తున్నారు. కొలీజియం సూచించిన పేర్లకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేస్తే వీళ్లందరికీ పదోన్నతి లభిస్తుంది.
Also Read:తెలంగాణ బీజేపీ ముందు 3 అతి ముఖ్యమైన సవాళ్లు - తేడా వస్తే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే !
Also Read: వైఎస్ఆర్‌సీపీ ఎన్డీఏలో చేరుతుందా ? కేంద్రమంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ముందు జగన్ పర్యటన అందుకేనా ?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial