Karnataka CM Siddaramaiah: చొక్కా విప్పమన్నారని గుళ్లోకి వెళ్లలేదు, బయటే మొక్కి వచ్చేశా - సీఎం కీలక వ్యాఖ్యలు
Karnataka CM Siddaramaiah: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదానికి తెర లేపారు.
Karnataka CM Siddaramaiah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ గొడవ తగ్గక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. కేరళ రాష్ట్రంలోని ఓ హిందూ దేవాలయంలో చొక్కా విప్పమన్నారని.. తాను గుడిలోకి ప్రవేశించ లేదని చెప్పారు. బయట నుంచే దేవుడిని ప్రార్థించుకొని వచ్చానని పేర్కొన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
‘‘ఒకసారి నేను కేరళలోని ఓ ఆలయానికి వెళ్లగా.. చొక్కా తీసి లోపలికి రమ్మని అడిగారు. దీంతో నేను గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించి, బయటి నుంచై ప్రార్థిస్తానని చెప్పాను. అలాగే బయట నుంచి మొక్కి వచ్చాను. అయితే అందరినీ చొక్కాలు తీయమని చెప్పలేదు. కొందరిని మాత్రమే తీయమని చెప్పారు. ఇది అమానవీయమైన ఆచారం. దేవుడి ముందు అందరూ సమానమే’’ అని సిద్ధరామయ్య అన్నారు. సంఘ సంస్కర్త నారాయణ గురు 169వ జయంతిని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోని అనేక దేవాలయాల్లో... గుడిలోకి వెళ్లే ముందు పురుషులు తమ చొక్కాలను తీసివేయడం సాధారణ ఆచారంగా వస్తోంది. అయితే చొక్కా తీసిన తర్వాత భుజాల పైనుంచి ఓ టవల్ వేసుకుంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమే.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి చిక్కుల్లో పడ్డారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని...పూర్తిగా సమాజంలో నుంచి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి ఈ ధర్మం వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. Sanatana Abolition Conference లో మాట్లాడిన సందర్భంలో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. పూర్తిగా సమాజం నుంచి తొలగించాలి. డెంగ్యూ. మలేరియా, కరోనాను ఎలాగైతే నిర్మూలిస్తున్నామో...అదే విధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతనం అనేది సంస్కృత పదం. సామాజిక న్యాయానికి ఇది పూర్తిగా విరుద్ధం"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు వరుస పెట్టి ట్వీట్‌లతో విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మండి పడుతున్నారు.
"ఓవైపు రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచాను అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎమ్‌కే మంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాత్రం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. అంటే ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టేగా. ఇప్పుడు ఆ కూటమి ఉద్దేశాలేంటన్నది స్పష్టంగా అర్థమవుతున్నాయి. వాళ్లకు అవకాశమిస్తే దేశాన్ని ముక్కలు చేస్తారు"
- అమిత్ మాల్వియా, బీజేపీ నేత