Kakinada Crime News: విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
Kakinada Crime News: బోరు బావి మోటారను బాగు చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. పని చేసే చోట విగత జీవులుగా పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Kakinada Crime News: పంటలు పండించి పది మంది కడుపు నింపే కష్టజీవులు ఆ అన్నదాతలు. అయితే వేసిన పంటను కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డారు. ఈక్రమంలోనే బోరు బావి పాడైంది. ఏమైందో తెలియక మోటార్లు బాగు చేసే వాళ్లను పిలిచాడు. వారంతా కలిసి బోరు మోటార్ ఎత్తుతండగా.. కాళ్లకు విద్యుత్ వైరు తాకింది. ఈక్రమంలోనే కరెంట్ షాక్ వచ్చి ముగ్గురు అన్నదాతలు అక్కడికక్కడే పడిపోయారు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తునారు.
కాకినాడ జిల్లా ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో ఉన్న పొలం వద్ద బోరు బావి మోటార్ పాడైంది. విషయం గుర్తించిన రైతు.. దాన్ని బాగు చేయించేందుకు మనుషులను పిలిచాడు. ఈక్రమంలోనే ఇద్దరు రైతులు వచ్చి బోరు బావిని బాగు చేయబోయారు. మోటార్ ను పైకి తీస్తుడంగా.. పొరపాటున విద్యుత్ తీగ వారి కాలికి తగిలింది. ఈక్రమంలోనే వారికి షాక్ కొట్టింది. ఒక్కసారిగా ముగ్గురు రైతులు అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు పొలానికి సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారని స్థానికులు చెబుతున్నారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. పనికోసం వెళ్లిన వాళ్లు ఇలా విగతజీవులుగా పడి ఉండడం చూసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురు రైతుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!
ఐదు నెలల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే
పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ్డ - బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.
ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. అలాగే ఓ రైతు కూడా విద్యుదాఘాతం ప్రాణాలు కోల్పోయాడు. ఏనుగుల పక్కనే అన్నదాత మృతదేహం కూడా కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు రైతు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండ వైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.