(Source: Poll of Polls)
Yuvagalam Navasakam: చంద్రబాబు అనుభవంతోనే టీడీపీ నిలబడింది - నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారని.. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Nadendla Manohar Comments: రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను రాష్ట్రమంతా కోరుకుంటోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలను అణగదొక్కాలని అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. చంద్రబాబు తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారని.. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారని అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన నవశకం బహిరంగసభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.
చంద్రబాబును ములాఖత్ లో కలిసిన రోజు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై రాష్ట్రమంతా హర్షించింది. యువగళం ముగింపు సభకు లోకేష్ మాత్రమే ముఖ్య అతిథిగా ఉంటే బాగుంటుందని మేం భావించాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. ఉపాధి, ఉద్యోగావకాశాల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు. రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత పొరపాటు జరిగిందో రాష్ట్రమంతా గమనించాలి. టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల ముందుకు తెచ్చాయి.
రాష్ట్ర ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. 3,123 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ కు ప్రత్యేక అభినందనలు. పాదయాత్రలో లోకేష్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉంది. రాష్ట్రప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీను ఆశీర్వదించండి’’ అని నాదెండ్ల మనోహర్ పిలుపు ఇచ్చారు.