(Source: Poll of Polls)
Jammu Kashmir: వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు, ముగ్గురు మృతి
Land Slides: ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుండడంతో మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. హిమ్‌కోట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Vaishno Devi Yatra : జమ్మూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని శరవేగంగా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రెండ్రోజులుగా భారీ వర్షం
గత రెండు రోజులుగా వైష్ణో దేవి ఆలయం ప్రాంగణంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నప్పటికీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుండడంతో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. హిమ్‌కోట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వైష్ణో దేవి ఆలయానికి రాకపోకలపై ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. కొందరు భక్తులు మరో మార్గం పాత సంజిచాట్ గుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయని శ్రీ మాతా వైష్ణో దేవి మందిరం బోర్డు సీఈవో ధృవీకరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళలను గురుదాస్‌పూర్‌లోని జ్ఞాన్‌పూర్ నివాసి సుదర్శన్ భార్య సప్న , యుపిలోని కాన్పూర్‌లో నివాసి నేహాగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమకోటి రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భక్తులందరూ కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి దూరంగా ఉండాలని, నిర్వాహకుల సూచనలను పాటించాలని ఆలయ సిబ్బంది, అధికారులు విజ్ఞప్తి చేశారు. పంచి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. దీంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఊహించని ఘటన నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్ర సమయంలో భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై పోగైన చెత్తను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించిన తర్వాత రోడ్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
వాతావరణ శాఖ అంచనా
జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ 12 వరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఆదివారం అంచనా వేసింది. అయితే, కేంద్ర పాలిత ప్రాంతంలో మరికొన్ని చోట్ల కొద్దిపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున, భారీ వర్షాల కారణంగా, ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చాలా చోట్ల బద్రీనాథ్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. పగల్నాల, పాతాళగంగ , నందప్రయాగ్ వద్ద హైవే బ్లాక్ చేశారు. దానిని తిరిగి తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. సిమ్లీ బజార్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఏడు దుకాణాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.
Also Read: Traffic Challan: కేంద్రమంత్రికే ఝలక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్‌లు, కార్ ఓవర్ స్పీడ్‌పై చలానా