J&K Assembly Polls: అమర్ నాథ్ యాత్ర తరవాత జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు! సిద్ధమవుతున్న బీజేపీ
J&K Elections 2024: అమర్ నాథ్ యాత్ర ముగిసిన తరవాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మేరకు అమిత్ షా సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.
J&K Assembly Elections 2024: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కేంద్రహోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ కిషన్ రెడ్డితో పాటు జేపీ నడ్డా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని అమిత్ షా ఆదేశించారు. అయితే..అమర్ నాథ్ యాత్ర ముగిసిన తరవాతే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆగస్టు 19న ఈ యాత్ర ముగిసిపోనుంది. ఆ తరవాతే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్లాన్ చేస్తోంది. 90 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఘన విజయం సాధించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అమిత్ షా తేల్చి చెప్పారు. 2019లో ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని మోదీ సర్కార్ రద్దు చేసింది. అప్పుడే జమ్ముకశ్మీర్‌ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అంతే కాదు. ఎన్నికల ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది. అయితే మిత్రపక్షాలను దృష్టిలో పెట్టుకుని పోటీ చేసే సీట్ల విషయంలో కాస్త సర్దుబాటు చేసుకోవాల్సి ఉండొచ్చని వెల్లడించింది.
ఇక ముఖ్యమంత్రి అభ్యర్థినీ ఇప్పటికీ బీజేపీ ప్రకటించలేదు. ఎన్నికలు పూర్తయ్యాకే అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్‌పై మరింత ఫోకస్ పెట్టనుంది అధిష్ఠానం. కేంద్రమంత్రులతో పాటు జాతీయ నాయకులు ఇక్కడ పర్యటించనున్నారు. ప్రజలతో మాట్లాడేందుకు పెద్ద ఎత్తున కాంటాక్ట్ ప్రోగ్రామ్‌నీ ప్రారంభించనుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించనున్నారు. రాష్ట్ర బీజేపీ యూనిట్‌లో మార్పులు చేర్పులు ఏమీ ఉండవని హైకమాండ్ వెల్లడించింది. ఎవరినీ పదవిలో నుంచి తీసేయడం కానీ, కొత్త వాళ్లను అవకాశమివ్వడం కానీ ఉండవని తెలిపింది. జమ్ముకశ్మీర్‌తో పాటు మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణాలో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.