Layoffs 2024: ప్చ్ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో - లేఆఫ్‌లపై పెరుగుతున్న టెన్షన్
Tech Layoffs 2024: అమెరికాలోని టెక్ సెక్టార్‌లో 89% మంది ఉద్యోగులు లేఆఫ్‌లపై టెన్షన్ పడుతున్నారు.
Layoffs in US: టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్‌లు (Layoffs in Tech Sector) కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కోతలు ఉద్యోగులను టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సంఖ్య భారీగా ఉంటోంది. బడా కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని లెవెల్స్‌లోని ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ లేఆఫ్‌లపై AuthorityHacker ఓ రిపోర్ట్ విడుదల చేసింది. అగ్రరాజ్యంలోని స్థితిగతులపై అధ్యయనం చేసి ఈ నివేదిక వెలువరించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే దాదాపు 193 కంపెనీలు 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. మార్చి నెలలో ఇప్పటి వరకూ 7 సంస్థలు 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని లక్షలాది మంది ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగుల్లో 54.58% మంది లేఆఫ్‌ల గురించి ఆందోళన చెందుతున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. టెక్ సెక్టార్‌లోని ఎంప్లాయీస్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిపింది. IT Services and Data సెక్టార్‌లో పని చేసే వాళ్లలో 89% మందికి పైగా భయపడుతుండగా... Software Development లో ఉన్న వాళ్లలో 74% మంది ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేదన్న భయం వాళ్లని వెంటాడుతోంది.
ఇక ఈ రిపోర్ట్‌లో AI గురించీ ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా కొంత మంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. 72% మంది AI టెక్నాలజీ కారణంగా తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా తమ ఉద్యోగం పోవచ్చని చెబుతున్నారు. దాదాపు 48% మంది AI కారణంగా కచ్చితంగా ఉద్యోగాలకు ఎసరు తప్పదని అభిప్రాయపడుతున్నారు. ప్రతి బడా కంపెనీలో 500-1000 మంది ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్‌లపైనే ఎక్కువగా ఆధారపడే సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్సెస్ సెక్టార్‌లలో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, విద్యా రంగాలు మాత్రమే కాస్తో కూస్తో సేఫ్‌గా ఉన్నట్టు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం 2024లోనూ కొనసాగుతూనే ఉంది. 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 32 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా స్నాప్ సంస్థ 540 మందిని తీసివేసింది. అంతకుముందు ఆక్టా అనే సాఫ్ట్‌వేర్ సంస్థ 400 మందిని ఇంటికి పంపింది. గూగుల్ (Google), అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు సైతం ఉద్యోగాల కోత విధించిన జాబితాలో ఉన్నాయి. యూపీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్(Microsoft), అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా, అసెంచర్ వంటి పెద్ద సంస్థలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వేలాది మందిని తొలగించినట్లు పేర్కొంది.
Also Read: ముఖంపై 15 సార్లు కత్తితో పొడిచి జిమ్ ట్రైనర్ దారుణ హత్య - తండ్రే హంతకుడా?