ఐరాస జనరల్ అసెంబ్లీలో హమాస్ యుద్ధంపై తీర్మానం, ఓటింగ్‌కి దూరంగా భారత్
Israel Hamas War: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై యూఎన్‌లో ఓటింగ్ జరగ్గా భారత్ దూరంగా ఉంది.
Israel Hamas Attack:
యుద్ధం ఆపాలంటూ తీర్మానం..
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో (UN General Assembly) ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికిప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించడంతో పాటు దాడులు ఆపేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. గాజా సరిహద్దు ప్రాంతంలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలనీ పిలుపునిచ్చారు. దీనిపై ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే...ఈ ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై (Israel Hamas War) దాడులకు దిగారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజానే టార్గెట్‌గా చేసుకుని ఇజ్రాయేల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. UNGA లోని 193 సభ్య దేశాలు Emergency Special Session నిర్వహించాయి. జోర్డన్‌తో పాటు బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్థాన్, రష్యా, సౌతాఫ్రికా కలిసి ఈ తీర్మానం ప్రవేశపెట్టాయి. మానవతా సాయం అందించేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదన్న పిలుపునిచ్చాయి. ఈ ఓటింగ్‌లో 120 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా...45 దేశాలూ ఓటింగ్‌కి దూరంగా ఉన్నాయి. ఈ 45 దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా,కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే ఉన్నాయి. అయితే..జోర్డాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో ఎక్కడా హమాస్ పేరు ప్రస్తావించలేదు. అందుకే భారత్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయలేదని తెలుస్తోంది.
బైడెన్ వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడుల వెనక ఉన్న కారణాలను ప్రస్తావించారు. G20 సదస్సులో భారత్ India-Middle East-Europe Economic Corridor ని ప్రకటించింది. ఈ కారిడార్ ప్రకటన వచ్చిన తరవాతే హమాస్ దాడులకు ప్లాన్ చేశారని అన్నారు బైడెన్. ఈ కారిడార్‌లో భాగంగా భారత్‌ని, మధ్యప్రాచ్యాన్ని రైల్, రోడ్, పోర్ట్‌ల ద్వారా అనుసంధానించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడి చేయడానికి చాలా కారణాలుండొచ్చని, అయితే వాటిలో ఈ కారిడార్ కారణం ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు బైడెన్. ఇదే కారణమని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేకపోయినా...కేవలం ఇది తన అంచనా మాత్రమే అని చెప్పారు.
"హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేయడానికి చాలా కారణాలుండొచ్చు. కానీ భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రకటించిన తరవాతే ఈ దాడులు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ఈ దాడుల వెనక ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నా వద్ద ఆధారాలు లేవు. కానీ ఇది నా అంచనా మాత్రమే. ఏమైనా కావచ్చు. ఇజ్రాయేల్ అభివృద్ధికి మేం ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. ఆ అభివృద్ధి పనుల్ని ఆపం"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
Also Read: దొంగతనాలు, అత్యాచారాల్లో ముస్లింలే నంబర్ వన్ - ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు