Vivek Ramaswamy: డోజ్ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి - ట్రంప్ ప్రమాణం చేసిన గంటల్లోనే కీలక నిర్ణయం
Vivek Ramaswamy : ఎలోన్ మస్క్‌తో కలిసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ లో కీలక నేతగా వ్యవహరిస్తోన్న భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Vivek Ramaswamy : భారతీయ అమెరిక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్((డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి వైదొలగారు. ఎన్నికల సమయంలో రిపబ్లిక్ అభ్యర్థిత్వానికి పోటీ పడిన ఆయన.. ఫలితాలు వెలువడిన వెంటనే ట్రంప్.. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. కాగా తాజాగా ఈ బాధ్యతల నుంచి వివేక్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో మార్పుల లక్ష్యంగా డోజ్ ను ఏర్పాటు చేశారు. ఒహియో గవర్నర్ గా పోటీ కొనసాగుతోన్న నేపథ్యంలో వివేక్ ఈ నిర్ణయం తీసుకోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
ఈ సందర్భంగా వివేక్ రామస్వామి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.‘‘డోజ్‌ను సృష్టించేందుకు మద్దతు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్ మస్క్, ఆయన బృందం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మరో వైపు ప్రభుత్వ ఎఫిషియెన్సీ బృందం ప్రశంసలు కురిపించింది. డోజ్ ఏర్పాటులో రామస్వామి కీలక పాత్ర పోషించాలని కొనియాడింది. గత రెండు నెలలుగా డోజ్ కోసం ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేసింది. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం అని చెప్పింది.
వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జెడి వాన్స్ ఖాళీగా ఉన్న సెనేట్ సీటుకు సంబంధించి రామస్వామి ఇటీవల ఓహియో ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్‌తో సమావేశమయ్యారు. అయితే, ఆ స్థానంలో తన లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తున్నట్లు డివైన్ ఇటీవలే ప్రకటించారు. మరోపక్క ఒహియో గవర్నర్ కు పోటీని ప్రకటించేందుకు రామస్వామి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన గెలిస్తే.. ఒహియోకు మొదటి భారతీయ అమెరికన్ గవర్నర్ ఆయనే అవుతారు. ఇప్పటివరకు అమెరికాకు గవర్నర్ గా కేవలం ముగ్గురు భారత అమెరికన్లు మాత్రమే ఎన్నికయ్యారు. మొదటగా లూసియానాలో బాబీ జిందాల్, తర్వాత సౌత్ కరోలినాలో నిక్కీ హేలీ. వీరిద్దరూ రిపబ్లిక్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఒహియో గవర్నర్ కోసం అతని ప్రకటన వచ్చే వారం ప్రారంభంలో రావచ్చని భావిస్తున్నారు.
ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ మస్క్‌తో పాటు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పనిచేసే డోజ్ కి సహ-నాయకుడిగా రామస్వామిని నియమించారు. ఈ ఏజెన్సీ ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు వైట్ హౌస్‌కు సలహాలు, మార్గదర్శకాలను అందిస్తుంది. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలోనూ ట్రంప్ రామస్వామి గురించి ప్రస్తావించారు. తమ బృందంలో వివేక్ తో పాటు కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారని, నిజంగా అద్భుతమైన పనులను చేయబోతున్నామని ట్రంప్ ప్రమాణానికి ముందు వాషింగ్టన్‌లో జరిగిన ర్యాలీలో తెలిపారు.
Also Read: Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి





















