Inox Green Energy Shares: తీవ్రంగా నిరాశపరిచిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ షేర్లు, 8% డిస్కౌంట్‌తో లిస్టింగ్
NSEలో దాదాపు 8 శాతం డిస్కౌంట్ ₹60 దగ్గర ఒక్కో షేర్ లిస్ట్ అయింది.
Inox Green Energy Shares: విండ్ పవర్ ఆపరేషన్ & మెయింటెనెన్స్ సర్వీస్ అందించే ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ (Inox Green Energy Services Ltd) షేర్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఐనాక్స్ గ్రీన్ షేర్లు ఇవాళ (బుధవారం, 23 నవంబర్ 2022) స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేశాయి. లిస్టింగ్ గెయిన్స్ ఇస్తాయనుకుంటే గూబ గుయ్యిమనిపించాయి.
వీక్ డెబ్యూ
IPOలో, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ షేర్ ఇష్యూ ప్రైస్ ₹65గా నిర్ణయించారు. ఇవాళ, NSEలో దాదాపు 8 శాతం డిస్కౌంట్ ₹60 దగ్గర ఒక్కో షేర్ లిస్ట్ అయింది. BSEలోనూ ఇదే తీరు. ఇక్కడ ₹60.5 వద్ద షేర్లు దలాల్ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టాయి. ఇది 7 శాతం డిస్కౌంట్ ప్రైస్.
₹740 కోట్ల విలువైన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) నవంబర్ 11న ప్రారంభమై 15న ముగిసింది. IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు ₹61-65గా కంపెనీ నిర్ణయించింది.
ఈ ఇష్యూలో ₹370 కోట్ల విలువైన ప్రైమరీ షేర్లను విక్రయిస్తే, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ మాతృ సంస్థ ఐనాక్స్ విండ్ (Inox Wind) కూడా అదే మొత్తంలో సెకండరీ సేల్ (OFS) చేసింది.
IPOకు ఒకరోజు ముందు జరిగిన యాంకర్ ఇన్వెస్టర్ల రౌండ్‌లో ₹333 కోట్లను కంపెనీ వసూలు చేసింది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు ₹65 చొప్పున 5.12 కోట్ల షేర్లను కేటాయించింది. మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) Pte, నోమురా సింగపూర్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్, HDFC మ్యూచువల్ ఫండ్ (MF), ICICI ప్రుడెన్షియల్ MF, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ MF వంటివి యాంకర్ ఇన్వెస్టర్ల లిస్ట్‌లో ఉన్నాయి.
ఈ ఇష్యూకి పెట్టుబడిదారుల నుంచి రెస్పాన్స్ పెద్దగా రాలేదు. ఇష్యూ మొత్తం కేవలం 1.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) పోర్షన్ 1.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయితే, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIs) కోటాకు కేవలం 50 శాతం రెస్పాన్స్ వచ్చింది. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు (RIIs) 4.7 రెట్ల బిడ్స్ వేశారు.
కంపెనీ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్న KR చోక్సీ, ఈ ఇష్యూకి సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇచ్చింది.
ఐనాక్స్ గ్రీన్ బిజినెస్
విండ్ ఫామ్ ప్రాజెక్టుల కోసం, ప్రత్యేకంగా విండ్ టర్బైన్ జనరేటర్లు & విండ్ ఫామ్‌లో మౌలిక సదుపాయాల కోసం లాంగ్‌టర్మ్ ఆపరేషన్ & మెయింటెనెన్స్ (O&M) సర్వీసులను ఐనాక్స్ గ్రీన్ అందిస్తోంది.
లాభనష్టాల పట్టిక
FY20-FY22 కాలంలో, మొత్తం ఆదాయం 4 శాతం CAGR వద్ద వృద్ధి చెందింది. అయితే.. ఎబిటా (EBITDA) మాత్రం FY20లోని ₹88.3 కోట్ల నుంచి FY22లో ₹82.2 కోట్లకు తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ FY20లోని 53.4 శాతం నుంచి FY22లో 47.7 శాతానికి దిగి వచ్చింది.
FY20లో ఈ కంపెనీ ₹27.7 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. FY22లో దానిని గణనీయంగా తగ్గించి ₹5 కోట్లకు (నెట్ లాస్) చేర్చింది. FY23లో, జూన్ త్రైమాసికంలో ₹61.8 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ₹11.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.