Indian soldier in Pak Jail: 60 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తండ్రి కోసం కొడుకు అన్వేషణ, భారత సైనికుడి కథ ఇది
Indian soldier in Pak Jail: 60 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన భారత సైనికుడు పాకిస్థాన్‌లో జైల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
Indian Soldier in Pak Jail:
పాక్ జైల్లో ఉన్నారా..?
60 ఏళ్ల క్రితం జైలు పాలైన తన తండ్రిని బయటకు విడిపించుకునేందుకు ఓ కొడుకు పడరాని పాట్లు పడుతున్నాడు. ఎలాగైనా విడుదల చేయండి అంటూ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వినతులు పంపాడు. ప్రస్తుతం ఈ కేసుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు సంగతేంటంటే...భారత్-పాకిస్థాన్ మధ్య 1965లో యుద్ధం జరిగింది. ఆ సమయంలో భారత సైనికుడు ఆనంద్ పత్రి కనిపించకుండా పోయారు. చాన్నాళ్ల వరకూ ఆచూకీ దొరకలేదు. అయితే ఆయనను లాహోర్ జైల్లో పెట్టినట్టు తరవాత సమాచారం అందింది. ఆ సైనికుడు కొడుకు బిద్యాధర్ పత్రి తన తండ్రిని విడుదల చేసేలా చొరవ చూపాలంటూ ప్రధానికి, రాష్ట్రపతికి మొర పెట్టుకున్నారు. నిజానికి ఆనంద్ పత్రిని 2007లోనే విడుదల చేయాల్సి ఉండగా...పాకిస్థాన్ పెట్టిన కండీషన్‌తో అది జరగలేదు. సైనిక హోదాలో కాకుండా సాధారణ పౌరుడిని విడుదల చేసినట్టు చేస్తామని పాక్ చెప్పింది. అందుకు భారత్ అంగీకరించలేదు. ఫలితంగా విడుదల వాయిదా పడింది.
బతికున్నారా..?
ప్రస్తుతం ఆనంద్ పత్రి కొడుకు బిద్యాధర్ పత్రి ఒడిశాలోని భద్రక్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. ఓ పబ్లికేషన్ సంస్థ ద్వారా తన తండ్రి పాక్‌లోని జైల్లో మగ్గిపోతున్నాడని తెలుసుకున్నట్టు వివరించారు. ఆనంద్ పత్రి కోల్‌కత్తా నుంచి ఇండియన్ ఆర్మీలో చేరారు. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించారు. 1965లో పాక్‌తో యుద్ధం జరిగే సమయంలో గల్లంతయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంచినట్టు సమాచారం. ఒకవేళ బతికే ఉంటే ఇప్పుడాయన వయసు 88 ఏళ్లుంటాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌నూ కలిశారు బిద్యాధర్ పత్రి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సహకరించాలని కోరారు. ఒకవేళ ఆనంద్ పత్రి చనిపోయి ఉంటే...ఆయన డెత్ సర్టిఫికేట్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం చూపించాలని డిమాండ్ చేశారు. తన తండ్రి చనిపోయి ఉంటే...ఆయనకు అమరుడనే గౌరవం దక్కాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశారు.