Indian Defence Ministry: కొత్త ఆయుధాలొస్తున్నాయ్, డిఫెన్స్‌లో సూపర్ పవర్‌గా భారత్
రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్న భారత్..కొత్త మిలిటరీ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్ల కోసం రూ.76 వేల కోట్లు కేటాయించింది.
![Indian Defence Ministry: కొత్త ఆయుధాలొస్తున్నాయ్, డిఫెన్స్‌లో సూపర్ పవర్‌గా భారత్ Indian Defence Ministry Approves Procurement Of Military Equipment Platforms Worth Rs 76,000 Crore Indian Defence Ministry: కొత్త ఆయుధాలొస్తున్నాయ్, డిఫెన్స్‌లో సూపర్ పవర్‌గా భారత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/e23523ab2f5940e7953b0ad27a8e6a7a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొత్త మిలిటరీ ఎక్విప్‌మెంట్ కోసం రూ.76 వేల కోట్లు
రక్షణ రంగం ఎంత పటిష్ఠంగా ఉంటే దేశం అంత భద్రంగా ఉంటుంది. అందుకే ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం గట్టిగానే కృషి చేస్తోంది. అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్‌లోనూ రక్షణ రంగ పరికరాలు, వ్యవస్థల్ని తయారు చేసేందుకు చొరవ చూపుతోంది. దేశీయ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలూ ఇస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ సంస్థల నుంచి భారీ మొత్తంలో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 76వేల కోట్ల రూపాయలు కేటాయించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్-DAC ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
రక్షణ శాఖలోనూ డిజిటలీకరణ
భారత నేవీకి అధునాతన కార్వెట్‌లు అందించేందుకు 36 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. నిఘా పెంచుకునేందుకు, ఎస్కార్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు, సర్ఫేస్ యాక్షన్ గ్రూప్ ఆపరేషన్లు చేరపట్టేందుకు ఇవి తోడ్పడనున్నాయి. తీర ప్రాంతాలను రక్షించుకోవటం సహా అవసరమైన సమయాల్లో శత్రువులపై దాడి చేసేందుకూ ఇవి ఎంతగానో సహకరించనున్నాయి. అధునాతన సాంకేతికతను వినియోగించి ఈ కార్వెట్‌లను తయారు చేయనున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. వీటితో పాటు డీఏసీ మరికొన్ని ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపింది. డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, SU-30 MKI ఏరో ఇంజిన్లు తయారు చేయనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ బాధ్యత తీసుకుంది. రఫ్ టెరైన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్, బ్రిడ్డ్ లేయింగ్ ట్యాంక్స్, వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ , యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటినీ దేశీయంగానే డిజైన్ చేసి తయారు చేయనున్నారు. మొదటి నుంచి డిజిటల్ భారత్ నినాదం వినిపిస్తూ వచ్చిన కేంద్రం రక్షణ శాఖలోనూ డిజిటలీకరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా రక్షణ శాఖకు సంబంధించి సెక్యూర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గగనతల, భూతల ఆపరేషన్లకు సంబంధించిన అన్ని వివరాలనూ డిజిటలైజ్ చేయనుంది. తీరప్రాంత రక్షణకు సంబంధించిన లాజిస్టిక్స్ సహా ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల సమాచారాన్నీ డిజిటలైజ్ చేసే ఆలోచనలో ఉంది రక్షణ శాఖ. ఈ నవీకరణలో భాగంగా ఎంత ఖర్చైనా వెనకాడటం లేదు రక్షణ శాఖ. ముఖ్యంగా దేశీయంగా తయారు చేసిన వాటినే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటం వల్ల ఆయా సంస్థలు మరింత ఉత్సాహంగా పని చేస్తూ దేశ రక్షణలో భాగస్వామ్యమవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)