పార్లమెంట్‌ని కుదిపేసిన మహిళా రిజర్వేషన్ బిల్, విపక్షాల విమర్శలకు స్మృతి ఇరానీ కౌంటర్
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్‌పై పార్లమెంట్‌లో మాటల యుద్ధం జరిగింది.
Women's Reservation Bill:
మాటల యుద్ధం..
మహిళా రిజర్వేషన్ బిల్‌పై పార్లమెంట్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా ఎంపీల ప్రసంగాలతో సభలు దద్దరిల్లిపోయాయి. ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ చర్చ మొదలు పెట్టారు. ఆ తరవాత వరసగా డీఎమ్‌కే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడారు. మోదీ ప్రభుత్వంవై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రెజ్లర్లు అన్ని నెలల పాటు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఎన్నికల గిమ్మిక్కు అంటూ మండి పడ్డారు. దీనికి దీటుగానే బదులిచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మోదీ ప్రభుత్వం మహిళలను లెక్కలోకి తీసుకుందని, గత ప్రభుత్వాలు మాత్రం మహిళల్ని లెక్క చేయలేదని తేల్చి చెప్పారు. ఈ బిల్‌కి సంపూర్ణ మద్దతునిస్తామని వెల్లడించిన సోనియా గాంధీ...ఓబీసీ వర్గానికి చెందిన మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని కోరారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారని అన్నారు సోనియా. దేశ స్వాతంత్య్రోద్యమం నుంచి మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 2010లోనే తాము రాజ్యసభలో ఈ బిల్ ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. అప్పట్లో కొందరు ఈ బిల్‌ని అడ్డుకున్నారని, అందుకే అమల్లోకి తీసుకురాలేకపోయామని స్పష్టం చేశారు. అప్పట్లో రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయినప్పటికీ లోక్‌సభలో పాస్ కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ అడ్డుకోవడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే...2029 వరకూ మహిళలకు ఈ బిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని తేల్చి చెప్పారు సోనియా గాంధీ. ఇది అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎన్నాళ్లు వేచి చూడాలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
స్మృతి ఇరానీ కౌంటర్‌లు..
డీఎమ్‌కే ఎంపీ కనిమొళి కూడా బిల్‌పై మాట్లాడారు. మహిళలను నమస్కరించాలని పూజించాలని చెప్పడం ఆపేయాలని, వాళ్లకు సమానత్వం ఇవ్వడం కన్నా గౌరవం ఇంకేమీ ఉండదని తేల్చిచెప్పారు. తమను తల్లిగా, చెల్లిగా, భార్యగా గౌరవించాల్సిన అవసరం లేదని, మగాళ్లతో సమానంగా చూస్తే చాలని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ బిల్ తీసుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న స్టంట్ అని మండి పడ్డారు. ఈ బిల్‌ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. "మహిళలు ఇంట్లో వంట చేసుకుంటే ఇంకెవరో వచ్చి దేశాన్ని నడిపిస్తారు" అనే భావజాలంతో బీజేపీ పని చేస్తోందని అన్నారు ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే. అయితే..ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగానే స్పందించారు. సోనియా గాంధీ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. 2010లో బిల్ తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం "ఇది మా బిల్" అని చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్‌పై ఎన్నో వాదోపవాదాలు జరిగాయి.
Also Read: మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవడానికి రాష్ట్రాల మద్దతు అవసరం లేదట!