Wayanad Disaster: అరేబియన్ సముద్రం ఎందుకు వేడెక్కుతుంది? దానివల్ల కేరళనే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది?
Kerala Massive Disaster : అరేబియా సముద్ర తీరానికి సమీపంలో డీప్ మెసోస్కేల్ క్లౌడ్ సిస్టం ఏర్పడిందని, దీంతో వాయనాడ్‌తో సహా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయని సైంటిస్ట్ అభిలాష్ తెలిపారు.
Wayanad Disaster : వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. ఈ విధ్వంసానికి సంబంధించి మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయని, దీని కారణంగా కేరళలో కొద్దిసేపటికే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. శాస్త్రవేత్తలు, నిపుణులు ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్స్, జనాభా కోసం సురక్షితమైన నివాస యూనిట్ల నిర్మాణానికి పిలుపునిచ్చారు. అల్పపీడనం కారణంగా వాయనాడ్, కాలికట్, కాసరగోడ్, కన్నూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుసాట్)లోని అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ చెప్పారు. వర్షాల కారణంగా గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతం మొత్తం ప్రభావితమైంది. రెండు వారాలుగా కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు.
అందువల్లే కేరళలో విధ్వంసం
సోమవారం అరేబియా సముద్ర తీరానికి సమీపంలో డీప్ మెసోస్కేల్ క్లౌడ్ సిస్టం ఏర్పడిందని, దీంతో వాయనాడ్‌తో సహా పలుచోట్ల భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డాయని అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. 2019లో కేరళ వరదల సమయంలో కనిపించిన మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయని అభిలాష్ తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అత్యంత దట్టమైన మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. కొన్నిసార్లు ఈ వ్యవస్థలు భూభాగంలోకి ప్రవేశిస్తాయని, 2019లో కూడా అదే జరిగిందని.. దీని కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఆయన చెప్పారు.
వేడెక్కుతున్న అరేబియా సముద్రం
అరేబియా సముద్రం ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతోంది . రాబోయే సంవత్సరాల్లో మరింత తీవ్రమైన తుఫానులు ఏర్పడతాయని సముద్ర శాస్త్రవేత్త, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. వాతావరణ మార్పులపై గతేడాది కొచ్చిలో నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరేబియా సముద్రం మరింత తీవ్రమైన తుఫానులకు సాక్ష్యమివ్వబోతోందని అప్పుడే చెప్పారు. ఆయన రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మార్పు కనిపిస్తుందని చెప్పారు. ఇది పశ్చిమ తీరానికి తెచ్చే విధ్వంసం అపారమైనదని అంచనా వేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కోస్తా రాష్ట్రాలు సన్నద్ధం కావాలని ఆయన ఆనాడే హెచ్చరించారు.
తుఫానులకు కారణం వేడి
అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత 1995 నుండి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీని వలన 300 మీటర్ల లోతు వరకు నీరు వేగంగా వేడెక్కుతోంది. సముద్రంలో నెలకొన్న అదనపు వేడి.. తుఫానులను ప్రేరేపిస్తుంది. వాతావరణం వేడెక్కడం వల్ల గాలిలో ఉన్న అధిక తేమ ఒక చిన్న ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కు దారి తీస్తుంది. ఇది వరదలకు కారణం అవుతుంది. అరేబియా సముద్రం దశాబ్దానికి 0.18 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కుతోంది. ఇది పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వేడెక్కడం కంటే చాలా ఎక్కువ. బంగాళాఖాతం ఉపరితల సముద్ర ఉష్ణోగ్రత.. అరేబియా సముద్రం కంటే ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ తరచుగా తుఫానులు వస్తుంటాయి.
ఊహించని విపత్తుకు కారణం అదే
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అట్మాస్ఫియర్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అభిలాష్ చెప్పినదాని ప్రకారం అరేబియా సముద్రం వేడెక్కుతుండటం ఈ ప్రాంతంలో ఊహించని భారీ వర్షాలకు కారణంగా ఉంది. సౌత్ ఈస్ట్ అరేబియన్ సముద్రం అంతకంతకూ వేడెక్కుతుండటంతో కేరళ సహా పశ్చిమ కనుమల్లోని ప్రాంతాలు పర్యావరణ పరంగా అస్థిరంగా ఉంటున్నాయి. అరేబియా సముద్రంలోని వేడి కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. దాంతో తరచూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ తరహా పరిస్థితి కేరళలో గత 8 ఏళ్ల నుంచి కన్పిస్తోంది.