Shahjahan Sheikh: సీబీఐ కస్టడీకి షాజహాన్ షేక్- బెంగాల్‌లో రెండు రోజుల హైడ్రామాకు తెర
టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో... బెంగాల్ పోలీసులు అతన్ని సీబీఐకి అప్పగించక తప్పలేదు. దీంతో.. సందేశ్‌ఖాలీ కేసులో రెండు రోజుల హైడ్రామాకు తెరపడింది.
sandeshkhali case update: టీఎంసీ నాయకుడు, సందేశ్‌ఖలీ కేసులో ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను సీబీఐ కస్టడీకి తీసుకుంది. బెంగాల్ సీఐడీ పోలీసులు... అతనికి వైద్య పరీక్షల నిర్వహించి.. ఆ తర్వత సీబీఐకి అప్పగించారు. కోల్‌కతా హైకోర్టు హెచ్చరికలతో... షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించారు బెంగాల్ పోలీసులు. దీంతో రెండు రోజుల హైడ్రామాకు ఫుల్‌స్టాప్ పడింది.
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. సందేశ్‌ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం సాయంత్రం 4గంటల 15నిమిషాల్లోగా.. నిందితుడు షాజహాన్ షేక్‌ను, సందేశ్‌ఖాలీ కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాల్సిందే అంటూ డెడ్‌లైన్ పెట్టింది ధర్మాసనం. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షాజహాన్ షేక్‌తోపాటు కేసు పత్రాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించారు బెంగాల్ పోలీసులు. దీంతో.. రెండు రోజులుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడింది.
వాస్తవానికి.. నిన్న (మంగళవారం) కూడా షాజహాన్‌షేక్‌ను, కేసు పత్రాలను సాయంత్రం 5 గంటలలోపు సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీన్ని బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశాన్ని త్వరగా విచారించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీం కోర్టు దానిని తిరస్కరించింది. తాము తక్షణమే దీనిపై విచారణ జరపలేమని తేల్చిచెప్పింది అత్యున్నత ధర్మాసనం. దీంతో.. సీబీఐ మంగళవారం సాయంత్రానికే కేసు నమోదు చేసింది. నిందితుడు షాజహాన్‌షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లింది. కానీ.. షాజహాన్ షేక్‌ను అప్పగించేందుకు బెంగాల్ పోలీసులు నిరాకరించారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అప్పగించలేమని చెప్పేశారు. దీంతో రెండు గంటలపాటు వేచిచూసిన సీబీఐ బృందం అక్కడి నుంచి వెనుదిరింది. బుధవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు సీబీఐ అధకారులు. బెంగాల్ పోలీసుల తీరును తప్పుబట్టిన కలకత్తా హైకోర్టు బుధవారం సాయంత్రం 4:15 గంటల్లోనే షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాదు.. బెంగాల్ సీఐడీ పోలీసులపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని తెలిపింది. దీంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఆయన్ను... సీబీఐకి అప్పగించారు బెంగాల్ సీఐడీ పోలీసులు. దాదాపు రెండు నెలల పాటు అరెస్టు నుంచి తప్పించుకున్న షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు గత వారమే అరెస్టు చేశారు.
సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్ అకృత్యాలు..
సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జాలు, లైంగిక వేధింపుల కేసుల్లో షాజహాన్ షేక్ కీలక నిందితుడిగా ఉన్నాడు. అతను, అతని మద్దతుదారులు.. సందేశ్‌ఖాలీలోని టీఎంసీ కార్యాలయంలో మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు... రేషన్ కుంభకోణం కేసులో విచారణకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై షాజహాన్ షేక్ అనుచరులు దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి... జనవరి 5వ తేదీన జరిగింది. ఫిబ్రవరి 18న.. షాజహాన్, అతని మద్దతుదారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ... సందేశ్‌ఖాలీలోని పలువురు మహిళలు చీపుర్లు, కర్రలతో నిరసన తెలిపారు.
ఎవరీ షాజహాన్ షేక్..?
45 ఏళ్ల షాజహాన్ కూలీ నుంచి రాజకీయ నేతగా ఎదిగాడు. సందేశ్‌ఖాలీలో అతన్ని అందరూ భాయ్ అని పిలుస్తుంటారు. 2013లో టీఎంసీలో చేరారు షేక్. టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే కంటే బాగా బలమున్న నేత. మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు సన్నిహితుడు. సందేశ్‌ఖాలీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్.. అక్కడి ప్రజలను శాసిస్తూ ఉంటాడు. స్థానికుల నుంచి భూములను లాక్కోవడం.. ఇవ్వకపోతే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం.. వంటి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇటీవల ఈడీ దాడుల తర్వాత.. కొంతమంది మహిళా బాధితులు షాజహాన్‌ను అరెస్టు చేయాలంటూ రోడ్డెక్కారు. దీంతో అతని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.