Land on Moon: చంద్రుడిపై ఎకరం భూమిని భార్యకు గిఫ్ట్ ఇచ్చిన భర్త, ఎకరం ఎంతంటే?
Land on Moon: పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చాడు.
Land on Moon: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి చంద్రుడిపై ఎకరం భూమి కొని భార్య పుట్టిన రోజుకు బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగాల్ లోని ఝర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహతో తన భార్య అనుమికకు ఈ బహుమతి ఇచ్చాడు. సంజయ్ మహతో, అనుమిత దంపతులది ప్రేమ వివాహం. గత ఏప్రిల్ లోనే వివాహం బంధం ద్వారా ఒక్కటయ్యారు. అయితే ప్రేమించుకునే రోజుల్లో అది ఇస్తా.. ఇది ఇస్తా.. కొండ మీది కోతిని తెచ్చిస్తా, చందమామను బహుమతిగా ఇస్తా అంటూ ఏవేవో హామీ గుప్పించేశాడట సంజయ్. అప్పుడెప్పుడో చేసిన మాటను నిజం చేయాలని అనుకుని చందమామపై ఎకరం స్థలం కొని తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు.
చంద్రయాన్-3 విజయం తర్వాత చాలా మంది చంద్రుని స్థలం కొన్నారని, తమ భాగస్వామికి, తల్లికి చెల్లికి గిఫ్ట్ ఇచ్చారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ చూస్తున్నప్పుడు సంజయ్ కు కూడా తన భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చంద్రునిపై ఎకరం కొనేశాడు. ఆ పత్రాలను తీసుకువచ్చి భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు. మరి చంద్రుడిపై స్థలానికి ఎవరు యజమానులు, ఎవరు అమ్ముతారు అనే ప్రశ్నలు వస్తున్నాయా? లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ చంద్రుడిపై భూముల అమ్మకాలు సాగిస్తోంది. సంజయ్ తన భార్యకు ఎకరం స్థలాన్ని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి ఎకరం జస్ట్ రూ. 10 వేలకే కొన్నాడు. అలా 10 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయగానే.. ఇలా పత్రాలు వచ్చేశాయి. వాటిని తీసుకువచ్చి తన భార్యకు గిఫ్ట్ అంటూ ఇచ్చేశాడు సంజయ్
ఇటీవల తెలంగాణకు చెందిన మహిళ కూడా చంద్రుడిపై భూమి కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన రోజే తెలంగాణకు చెందిన NRI సాయి విజ్ఞత భూమి కొనుగోలు కోసం పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. ఇప్పుడు వీరవల్లి వాసి జగన్నాథరావు కూడా చంద్రుడిపై రెండు ఎకరాలు కొన్నారు.
లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. చంద్రునిపై ప్రయోగాలు, చంద్రమండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టేందుకు లూనార్ రిపబ్లిక్ సొసైటీ. ఈ విషయం తెలుసుకున్న వీరవల్లి వాసి జగన్నాథరావు.. న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఆఫీసుకు వెళ్లి తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం భూమి కొన్నాడు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో పూర్తి వివరాలతో లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఆయనకు రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్ ఇచ్చింది.
చంద్రుడిపై భూమిని కొంటున్నారు సరే.. మరి హక్కుల మాటేమిటి అంటే.. చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. చంద్రుడిపై భూమిపై కొనుగోలుదారులు యాజమాన్య హక్కులు పొందలేరు. ఆ భూమి వారి పేరుపై రిజిస్ట్రర్ అయ్యి ఉంటుంది. అంతవరకే. చంద్రుడితో సహా బాహ్య అంతరిక్షం ఎవరికీ సొంతంకాదని.. 1967లో అమల్లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై భారత్ సహా 110 దేశాలు సంతకం చేశాయి. 1967, అక్టోబర్ 10న అమల్లోకి వచ్చిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం చంద్రుడు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది సింబాలిక్ మార్క్ మాత్రమే. దీనికి చట్టపరమైన చెల్లుబాటు లేదు. అయితే, నివాసయోగ్యంగా ఉంటే మాత్రం అక్కడ నివసించవచ్చు.