Assembly Polls 2022 Live: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్- గోవాలో 5 గంటల వరకు 75 శాతం ఓటింగ్

2022లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు యూపీలో రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉత్తరాఖండ్, గోవాల్లోనూ నేడు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
గోవాలో 75 శాతం

దేశంలో ఈరోజు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు గోవాలో 75 శాతం, ఉత్తరాఖండ్‌లో 59 శాతం పోలింగ్ నమోదైంది. యూపీ రెండో విడత పోలింగ్‌లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

1 గంట వరకు

గోవా, ఉత్తరాఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు గోవాలో 44 శాతం, ఉత్తరాఖండ్‌లో 35 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు యూపీలో జరుగుతోన్న రెండో విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది.

11 గంటల వరకు

గోవా, ఉత్తరాఖండ్, యూపీలలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 11 గంటల వరకు గోవాలో 26%, యూపీలో 23%, ఉత్తరాఖండ్‌లో 19% పోలింగ్ నమోదైంది.

 

Uttarakhand CM Casts His Vote: ఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

Uttarakhand CM Pushkar Singh Dhami casts his vote: ఖాతిమ బీజేపీ అభ్యర్థి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, తల్లితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఎం పుష్కర్ ఓటు వేశారు.

Goa CM cast his vote:ఓటు హక్కు వినియోగించుకున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్

Goa CM Pramod Sawant cast his vote: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రమోద్ సావంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోటోంబీ గ్రామంలో ఓటు వేశారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ ఏం చేసిందో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఉత్పల్ పారికర్, కాంగ్రెస్ అభ్యర్థి మైఖేలో లోబో గెలవరని, బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.

బీజేపీకి 60కి పైగా సీట్లొస్తాయి: ఉత్తరాఖండ్ సీఎం

ప్రజల కోసం ఎవరు పనిచేస్తారో ఓటర్లకు బాగా తెలుసు. బీజేపీకి 60కి పైగా సీట్లు వస్తాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కావాల్సినవి తమ పార్టీ చేసిందని చెప్పారు.

గోవాలో బీజేపీదే అధికారం: సీఎం

గోవా ముఖ్యమంత్రి పోలింగ్‌పై స్పందించారు. ‘‘ఈరోజు ఉదయం ప్రధాని మోదీ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో బీజేపీ 22కు పైగా సీట్లు గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. 10 ఏళ్లలో బీజేపీ చేసిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రధాని మోదీ స్వయం సమృద్ధి దార్శనికత 100 శాతం మెజారిటీతో మాకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

Background

ఉత్తర్​ప్రదేశ్ రెండో దశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. 586 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ఈ రెండో దశలో జరిగే స్థానాల్లో ముస్లింలదే హవా. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం కానున్నాయి. స్థానికంగా చెరకు రైతులకు ఉన్న బిల్లుల చెల్లింపుల అంశం ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఈ క్రమంలో మొదటిదశ పోలింగ్‌తో పోలిస్తే బీజేపీ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు, రెండో విడతలో పోలింగ్ జరిగే సహారన్‌పుర్‌, రాంపుర్‌ తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్​వాదీ పార్టీకి గట్టి పట్టు కూడా ఉంది.

దీనికి తోడు కేంద్ర వ్యవసాయ చట్టాలు.. అనంతర పరిణామాలు కూడా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ అంశం కూడా కీలకమే. ఇలాంటి కారణాల నేపథ్యంలో రెండోదశలో బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ముస్లిం ఓట్లను చీల్చగలిగితే బీజేపీకి లాభం కలిగే ఛాన్స్ ఉంది.

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దళితులు 20 శాతంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటువైపు పడతాయనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గతంలో ఈఈ ప్రాంతాల్లో ముస్లిం, జాట్‌, దళిత ఓటర్ల కూటమి ఫార్ములా విజయవంతం అయింది. అందుకే ఈసారి సమాజ్ వాదీ పార్టీ ఆర్‌ఎల్‌డీ, మహాన్‌ దళ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ కారణంగా జాట్‌ ఓట్లపై ఆర్‌ఎల్‌డీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. బదాయూ, సంభల్‌ జిల్లాల్లో ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అక్కడ ఎస్పీకే బలమెక్కువ.

నేడు ఉత్తరాఖండ్‌లోనూ...
ఉత్తరాఖండ్​లోనూ నేడు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 13 జిల్లాల్లోని 70 నియోజకవర్గాలకు అన్నీ ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో 82,38,187లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ అభ్యర్థుల్లో 152 మంది స్వతంత్రులు ఉన్నారు. కరోనా కారణంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 101 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం 6 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

గోవాలోనూ ఒకేదశలో
గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు శివసేన కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కూడా గతంలో తన తండ్రి స్థానం పనాజీ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడి టికెట్ బీజేపీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.