Drunk Man Forgot Car: అరె ఏంట్రా ఇది - తప్ప తాగి కారు మరిచాడు, మరుసటి రోజుకు గాని విషయం గుర్తురాలేదు!
Drunk Man Forgot Car: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి తన కారును గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం విషయం గుర్తుకొచ్చి లబోదిబోమన్నాడు.
Drunk Man Forgot Car: తప్ప తాగితే తరతమ భేదాలు మర్చిపోతారు. ఫుల్లుగా తాగితే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్యం సేవించాక చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. చుట్టు పక్కల ఏం జరుగుతుందో అన్న సోయి కూడా ఉండదు. ఫుల్లుగా తాగి రోడ్లపైనే పడిపోయే వారు కొందరైతే, పక్కింటి తలుపు తట్టే వారు మరికొందరు. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే ఫుల్లుగా తాగేసి అన్నీ మర్చిపోయాడు. అందులో వింతేం ఉంది అనుకుంటున్నారా.. వింతేం లేదు కానీ విచిత్రం మాత్రం ఉంది.
హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన అమిత్ ప్రకాష్(30) ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. బార్ కు వెళ్లి ఫుల్లుగా మద్యం సేవించాడు. బార్ మూసేశాక బయటకు వచ్చేశాడు. బార్ లో తాగింది ఏమూలకూ సరిపోలేదని తన కారులో ఓ వైన్ షాప్ వద్దకు వెళ్లాడు. కారు దిగొచ్చి వైన్ షాప్ లో బాటిల్ కొన్నాడు. మళ్లీ తన కారు వద్దకు వచ్చి తాగడం మొదలు పెట్టాడు. అంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అతడి వద్దకు వచ్చి.. నేను కూడా తాగొచ్చా అని అడిగాడు. అమిత్ ప్రకాష్ తనకు మద్యం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఫుల్లుగా తాగేశారు. తర్వాత ఇద్దరూ కలిసి సుభాష్ చౌక్ వరకు వెళ్లారు. అక్కడి వరకు ఆ అపరిచిత వ్యక్తే కారును డ్రైవ్ చేయగా, ప్రకాష్ తన పక్కన కూర్చున్నాడు. సుభాష్ చౌక్ వద్ద.. బ్రో ఇక నువ్వు కారు దిగేసి ఇంటికెళ్లిపో అని ఆ అపరిచిత వ్యక్తి ప్రకాష్ కు చెప్పడంతో.. అది తన కారు కాదేమో అనుకుని టాటా బైబై చెప్పేసి దిగిపోయాడు.
మద్యం మత్తులో కారు నుంచి దిగిన అమిత్ ప్రకాష్.. ఆటోరిక్షాలో హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నాడు అక్కడి నుంచి మెట్రోలో తను ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అమిత్ ప్రకాష్.. నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక రాత్రి జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా గుర్తు రావడం మొదలైంది. తన కారును ఓ అపరిచిత వ్యక్తి ఇచ్చేశానని గుర్తొచ్చి షాక్ తిన్నాడు. తాగిన మత్తులో ఎవరికో కారు ఇచ్చేశానని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం పోలీసులు చెప్పాడు. కారుతో పాటు అందులో రూ. 18 వేల నగదు, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అపరిచిత వ్యక్తి ఎలా ఉంటాడు, అతని ముఖం ఎలా ఉంటుంది, ఎత్తు ఎంత, ఇతర వివరాలేవీ చెప్పే పరిస్థితిలో లేడు అమిత్ ప్రకాష్. తాను బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎక్కడి వైన్ షాప్ లో బాటిల్ తీసుకున్నది మాత్రం గుర్తు తెచ్చుకుని చెప్పాడు. ఆ వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.