Ex MLA Marries Actress: ముచ్చటపడి నటిని పెళ్లి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే- 6 ఏళ్లపాటు సస్పెండ్ చేసిన బీజేపీ
Suresh Rathore Marries Actress Urmila Sanawar | జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎస్సీ విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సురేష్ రాథోడ్ ను 6 ఏళ్ల పాటు పార్టీ బహిష్కరించింది.

Uttarakhand News: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌కు పార్టీ ఊహించని షాకిచ్చింది. ఇటీవల నటి ఊర్మిళ సనావర్‌ను వివాహం చేసుకున్న జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల అమలులోకి వచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (UCC) నిబంధనలను ఉల్లంఘించి, రెండో పెళ్లి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. UCC ప్రకారం, మొదటి భార్య లేదా భర్తతో చట్టబద్ధంగా వివాహం చెల్లుబాటులో ఉన్న సమయంలో రెండో పెళ్లి చేసుకోవడం నేరంగా పరిగణిస్తారు.
జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడైన సురేష్ రాథోర్‌ను పార్టీ వివరణ కోరుతూ ఇటీవల నోటీసు పంపింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఉత్తరాఖండ్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ సురేష్ రాథోడ్ మీద చర్యలు తీసుకుంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యేను 6 ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ కఠిన చర్యలు చేపట్టింది.

వివాదానికి దారి తీసిన నటితో సంబంధం
నటి ఊర్మిళ సనవర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ మధ్య గతంలో వివాదం నెలకొంది. వీరిద్దరూ గతంలో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో నటి ఊర్మిళ సనావర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన తమ మొదటి భార్యతో ఇంకా వివాహబంధంలోనే ఉన్నారు.
సురేష్ రాథోడ్, నటి ఊర్మిళ సనావర్ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ ప్రత్యర్థుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం పార్టీని, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది.

అనుచిత ప్రవర్తన, ప్రతిష్టకు భంగం కలిగించారు
బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు మహేంద్ర భట్ ఆదేశాల మేరకు, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బిష్త్ గత వారం సురేష్ రాథోర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొదటి భార్యతో వివాహ బంధంలో ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులలో కోరారు. "ఆయన అనుచిత ప్రవర్తన, మీడియా, సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో హాట్ టాపిక్ అయింది. ఇది పార్టీకి చెడ్డ పేరు తెచ్చింది. తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యానికి దారితీసింది" అని బీజేపీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ సైతం నటితో తన రెండో వివాహంపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడంతో, పార్టీ ఆయనపై కఠిన నిర్ణయం తీసుకుంది. సురేష్ రాథోర్‌ను ఆరు సంవత్సరాల పాటు బీజేపీ అధికారికంగా బహిష్కరించింది. UCC కింద అంతర్గత క్రమశిక్షణ, చట్టబద్ధమైన పాలనను కొనసాగించడానికి తాము కట్టుబడి ఉంటామని ఉత్తరాఖండ్ బీజేపీ అధిష్టానం తెలిపింది.






















