సీడబ్ల్యూసీలో అనూహ్య మార్పులు - ఖర్గే టీంలో ఆరుగురు తెలుగోళ్లు
రాజీవ్ జయంతి రోజున ప్రకటించిన సీడబ్ల్యూసీలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు జీ-23 నేతలకి స్థానం కల్పించారు. ఇందులో 39 మంది రెగ్యులర్ సభ్యులు ఉంటే... 32 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు, సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన టీంను బిల్డ్ చేశారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని 84 మందితో టీంను ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నికై దాదాపు ఏడాది కావస్తున్న టైంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని నియమించారు.
రాజీవ్ గాంధీ జయంతి రోజున ప్రకటించిన సీడబ్ల్యూసీలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు జీ-23 నేతలకి కూడా స్థానం కల్పించారు. కొత్తగా నియమించిన సభ్యుల్లో 39 మంది రెగ్యులర్ సభ్యులు ఉంటే... 32 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లను కూడా స్థానం కల్పించారు. మరో 13 మంది స్పెషల్ ఇన్వైటీస్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆరుగురికి సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరికి స్థానం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురికి చోటు ఇచ్చారు. వీరిలో ఒకరికే రెగ్యులర్ సభ్యుడి హోదా దక్కింది. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని రెగ్యులర్ సభ్యుడిగా నియమించారు. టీ సుబ్బహిరామిరెడ్డి, కొప్పుల రాజు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహను శాశ్వత ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కింది. కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల లిస్ట్‌లో చోటు ఇచ్చారు.
ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మందికి అవకాశం లభిస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరికే ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికలు ఉన్న టైంలో చాలా మంది పేర్లు ప్రస్తావించినప్పటికీ అన్నింటినీ పక్కన పెట్టి రెండు సామాజిక వర్గాల నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు. చట్ట సభల్లో కనీసం ప్రాతినిధ్యం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురిని ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరించింది.
పార్టీలో సీనియర్లకు గౌరవం లేదంటూ 23 మంది లీడర్లు G23 పేరుతో సోనియా గాంధీకి లేఖ రాయడం గతంలో సంచలనమైంది. ఈ G 23 టీమ్‌లో ఉన్న లీడర్స్‌కీ సీడబ్ల్యూసీలో చోటిచ్చింది హైకమాండ్. నిజానికి చాలా కాలంగా ఈ కమిటీలో మార్పులు చేయాలని చూస్తోంది హైకమాండ్. ఇప్పుడు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సంస్కరణలు చేపట్టారు. భారీ మార్పులు ఉంటాయని భావించినా...కొంత మేర మార్పులు చేశారు ఖర్గే. దీనిపై ఎన్నో నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. సోనియా, రాహుల్‌తో విడతల వారీగా చర్చలు జరిపిన మల్లికార్జున్ ఖర్గే...లిస్ట్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ 39 మందిలో మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని, అంబికా సోని, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు 32 శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక సభ్యులు, యూత్ కాంగ్రెస్, NSUI,మహిళా కాంగ్రెస్, సేవా దళ్ అధ్యక్షులకూ చోటు దక్కింది.
మరోవైపు రాజస్థాన్‌లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నించింది. అందుకే సీడబ్ల్యూసీలో సచిన్ పైలట్‌కు చోటు ఇచ్చింది. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ హైకమాండ్‌ని ఇబ్బంది పెడుతున్న సచిన్ పైలట్‌ని వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించడం ఆసక్తికరంగా మారింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఖర్గేతో పోటీ పడిన శశి థరూర్‌కీ ఈ కమిటీలో చోటు దక్కింది.