S Jaishankar Security Breach: లండన్‌లో జైశంకర్ కారు ముందు ఖలిస్తానీల నిరసన- యుకె సీరియస్ రియాక్షన్
S Jaishankar Security Breach: లండన్‌లో నిరసన తెలుపుతున్న ఖలిస్తానీ మద్దతుదారులు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను వెంబడించడం సంచలనంగా మారింది. దీన్ని బ్రిటిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

S Jaishankar Security Breach: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలు బ్రిటన్ ప్రభుత్వాని షేక్ చేశాయి. జైశంకర్ కారు ముందు ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన తెలపడం సంచలనంగా మారింది. దీంతో లండన్‌లో ఆయన భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
జైశంకర్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై భారత్ నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీనిపై UK విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. "భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ UK పర్యటన సందర్భంగా చాథమ్ హౌస్ వెలుపల జరిగిన ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. శాంతియుత నిరసన హక్కును UK సమర్థిస్తుంది, కానీ ప్రజా కార్యక్రమాల్లో జొరబడి బెదిరించడం, అంతరాయం కలిగించే ప్రయత్నమేదైనా పూర్తిగా ఆమోదయోగ్యం కాదు." అని ఓ ఖండనను యూకే ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read: షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ టూర్‌లో భద్రతా లోపం
లండన్‌లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్న నిరసనకారుల సమూహంలోని ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించి దూసుకొచ్చాడు. చాథమ్ హౌస్ ప్రధాన కార్యాలయం నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బయలుదేరుతుండగా కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వేర్పాటువాదులు చేసిన దుందుడుకు చర్యను భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతా లోపంపై ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సూచించింది.
ఆందోళన వద్దని UK రిప్లై
జయశంకర్ భద్రతపై ఆందోళన వద్దని యూకే ప్రకటించింది. "జరిగిన ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు పరిస్థితి చక్కదిద్దేందుకు వేగంగా పని చేశారు. అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా మా దౌత్య సందర్శకులందరి భద్రత కల్పించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము" అని UK విదేశాంగ కార్యాలయం తెలిపింది. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఇన్‌సైట్ యుకె ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. "డాక్టర్ జైశంకర్ యుకె పర్యటనలో ఉన్న టైంలో యుకె విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో సమావేశమైన వేళ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తున్న సందర్భంగా ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు" అని పేర్కొంది.
భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "విదేశాంగ మంత్రి బ్రిటన్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించిన ఫుటేజీని మేము చూశాము. వేర్పాటువాదులు రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నాము. అలాంటి టైంలో ఆతిథ్య ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలను పూర్తిగా పాటిస్తుందని మేము ఆశిస్తున్నాము." అని ఈ మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపైనే సాయంత్రానికి యూకే ప్రభుత్వం తన రిప్లై ఇచ్చింది. ఇలాంటివి సహించబోమని స్పష్టం చేసింది.





















