Viral Video: చనువు ఇచ్చిందని సింహం జోలికి, పరధ్యానంగా ఉందని ఏనుగును వెళ్లకూడదురోయ్! ఇదిగో ఇలా పరుగులు పెట్టిస్తుంది!
Elephant Attack Video: బందీపూర్ అడవిలో అడవి ఏనుగు ఇద్దరు పర్యాటకులను వెంటాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka Bandipur Forest Video Goes Viral: కర్ణాటక-కేరళ సరిహద్దులోని బందీపూర్(Bandipur) అటవీ ప్రాంతంలో సెల్ఫీ (Selfie) తీసుకోవడానికి కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులను అడవి ఏనుగు వెంటాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఏనుగు దాడిలో ఒకరు చావు అంచు వరకు వెళ్లి క్షేమంగా బయటపడ్డారు.
కేరళలోని అలపుజ(Alappuzha)కు చెందిన కొందరు నిన్న తమ కుటుంబంతో కలిసి కారులో నీలగిరి జిల్లాలోని ఊటీ(Ooty)కి విహారయాత్రకు వెళ్లారు. అనంతరం ముదుమలై మీదుగా బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి తిరిగి కేరళకు చేరుకున్నారు.
వెంబడించిన అడవి ఏనుగును
ముత్తంగ అభయారణ్యం(Muthanga Forest) రోడ్డు దాటుతుండగా ఆ ప్రాంతంలో మూడు అడవి ఏనుగులు నిలబడి ఉండటాన్ని గమనించారు. ఇది గమనించిన పర్యాటకులు ప్రమాదాన్ని గ్రహించకుండా కారును ఆపి దిగి అడవి ఏనుగుల ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు ఒక ఏనుగు వారిని వెంబడించడం ప్రారంభించింది.
OMG! The person is very lucky to have survived the Elephant attack at Bandipur-Wayanad Tiger Reserve. #Bandipur pic.twitter.com/HfwsxKVVRv
— Mohammed Zubair (@zoo_bear) February 1, 2024
ఏనుగు వెంబడించడం మొదలు పెట్టడంతో పర్యాటకులు పరుగులు తీశారు. కానీ అడవి ఏనుగు మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇద్దరిలో ఒకరు పరిగెత్తుతూ కిందపడిపోయారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అతను ఏనుగు కాళ్ల కింద నలిగిపోయారని అనుకున్నారు.
అయితే అదృష్టవశాత్తూ అదే టైంలో మరో వాహనం ఏనుగుకు ఎదురుగా వచ్చి గట్టిగా హారన్ మోగించింది. దీంతో ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఏనుగు కాలి కింద నలిగిపోవాల్సిన ఆ వ్యక్తి ప్రాణాలతో బతుకు జీవుడా అంటూ కారులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈ దృశ్యాలను కొందరు వాహనదారులు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
బందీపూర్ అటవీ ప్రాంతంలో ఏనుగులు పర్యాటకులను వెంబడించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సఫారీలో పర్యాటకులను ఏనుగు వెంటాడుతున్న వీడియో బయటకు వచ్చింది. డ్రైవర్ నైపుణ్యంతో టూరిస్టులు దాడి నుంచి బయటపడ్డారు. గత కొన్ని నెలలుగా కర్ణాటకలో ఇలాంటి ఘటనలు గణనీయంగా పెరిగాయి. అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.