Tomato Price: కాపురాన్ని కూల్చిన రెండు టమాటాలు, భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య
Tomato Price: తనకు తెలియకుండా రెండు టమాటాలు వాడాడన్న కోపంతో భర్తను వదిలేసి భార్య వెళ్లిపోయింది.
Tomoto Price:
రెండు టమాటాలతో తగవు..
జేబులకు చిల్లు పెడుతున్న టమాటాలు...కాపురాలనూ కూల్చుతున్నాయి. భార్యా భర్తల మధ్య తగువులు పెడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో కేవలం టమాటాల కారణంగానే భార్యా భర్తలు దూరమయ్యారు. ఓ టిఫిన్ సెంటర్‌ని నడుపుతున్న సంజీవ్ బర్మన్ ఇంటికి వచ్చేటప్పుడు టమాటాలు పట్టుకొచ్చాడు. ధరలు ఎక్కువగా ఉన్నాయని పొదుపుగా వాడాడు. కేవలం రెండే రెండు టమాటాలతో వంట చేశాడు. అదే అతడి కొంప ముంచింది. "నాకు చెప్పకుండా టమాటాలు వండుతావా" అని గొడవకి దిగింది భార్య. ఏం చేయాలో అర్థంకాక సైలెంట్ అయిపోయాడు సంజీవ్. ఆ తరవాత మాట మాటా పెరిగింది. ఈ గొడవ ముదిర చివరకు కూతురితో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది భార్య. చాలా చోట్ల వెతికినా వాళ్ల ఆచూకీ దొరకలేదు. కంగారుపడిపోయి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. తమ వాళ్లెక్కడున్నారో వెతికి పెట్టాలని రిక్వెస్ట్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"నేను చేసిన తప్పేమీ లేదు. కేవలం వంటలో రెండు టమాటాలు వాడానంతే. అంత చిన్న కారణానికే గొడవ పడి వెళ్లిపోయింది. నాకెందుకు చెప్పలేదని నిలదీసింది. ఉన్నట్టుండి కూతురితో సహా వెళ్లిపోయింది. ఇప్పటికి మూడు రోజులు దాటినా వాళ్లు ఎక్కడున్నారో తెలియడం లేదు. త్వరలోనే వాళ్లను వెతికి పట్టుకుని తిరిగి ఇంటికి పంపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు"
- సందీవ్ బర్మన్, బాధితుడు
రూ.38 లక్షల ఆదాయం..
టమాట పుణ్యామా అని కొన్ని రైతు కుటుంబాలు ఇప్పుడు డబ్బుల పంట పండిస్తున్నాయి. కర్ణాటకలోని ఓ అన్నదాత కుటుంబం ఒకే రోజు ఏకంగా రూ.38 లక్షల సొమ్ము కళ్లచూసింది! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రాలు, నగరాలను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే చివరి నెల్లోనే ఏకంగా 326 శాతం ధర పెరిగిందని ప్రభుత్వ సమాచారం. కర్ణాటకలోని కొందరు రైతులకు ఇది వరంగా మరింది. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం 2000 బాక్సుల టమాట అమ్మి ఏకంగా రూ.38 లక్షలు సంపాదించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. కర్ణాటకలోని బేతమంగళ జిల్లాలో ప్రభాకర్ గుప్తా ఆయన సోదరులు కలిసి 40 ఎకరాల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరూ 15 కిలోల టమాట బాక్స్ (Tomato) ఒక్కోటి రూ.800కు అమ్మారు. మొన్నటి వరకు వారు చూసిన అత్యధిక ధర అదే! కానీ ఈసారి ఒక్కో డబ్బాను ఏకంగా రూ.1900కు విక్రయించారు. తాము నాణ్యమైన టమాటాలను పండిస్తామని, ఎరువులు, పురుగుల మందులు ఎలా వాడాలో బాగా తెలుసని ప్రభాకర్ సోదరుడు సురేశ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి ఎక్కువ ధరలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడకు పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.
Also Read: మూడు రోజుల వర్షానికే ఢిల్లీ ఎందుకు మునిగిపోయింది? ఆ తప్పే ముప్పులా మారిందా?