Supreme Court: రోడ్డు మధ్యలో ఉన్న మతపరమైన కట్టడాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court: ఇటీవల బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా మరోసారి బుల్డోజర్లతో జరుగుతున్న విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది.
Supreme Court: రోడ్డు మధ్యలో ఉన్న మత నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఏ మతానికి చెందినవైనా.. వాటిని వెంటనే తొలగించాలని అధికారుల్ని ఆదేశించింది. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరమైనా, అది ఏ మతానికి చెందినదైనా అక్రమ కట్టడంగా గుర్తించాల్సిందేనని చెప్పింది. ఇక్కడ ప్రజల విశ్వాసాలతోపాటు వారి ప్రాణాలూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. అలాంటి నిర్మాణాల వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, అందుకే వెంటనే వాటిని తొలగించాలని చెప్పింది. ప్రభుత్వ స్థలాలు, జలాశయాలు, ప్రజలకు ఉపయోగపడే బహిరంగ ప్రదేశాలలో కూడా అక్రమ నిర్మాణాలు ఉండటానికి వీల్లేదని సుప్రీం తెలిపింది. ఫుట్‌పాత్ ల ఆక్రమణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు అడవులను కూడా కొంతమంది ఆక్రమించేస్తున్నారని.. ఆక్రమణలకు పాల్పడి నిర్మించే అక్రమ కట్టడాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించబోదని స్పష్టం చేసింది.
కొన్నిచోట్ల రహదారుల్ని వెడల్పు చేసే క్రమంలో వాటి పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలు అడ్డు వస్తుంటాయి. ప్రత్యామ్నాయ స్థలం చూపించినా కొందరు వాటిని అక్కడే ఉంచాలని పట్టుబడుతుంటారు. ఆ క్రమంలో అవి హైవే మధ్యలో కూడా ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. హైవే మధ్యలో ఉండే ఆ నిర్మాణాల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి ప్రమాదం జరిగి ఆ నిర్మాణానికి డ్యామేజీ జరిగితే, ఆ తర్వాత అది మరింత విస్తరిస్తుంది. అధికారులు అడ్డుకున్నా.. స్థానికుల మత విశ్వాసాల వల్ల వారు వెనకడుగు వేయాల్సి వస్తోంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈసారి ఈ నిర్మాణాలపై కీలక ఆదేశాలిచ్చింది. ఏ మతానికి చెందిన నిర్మాణం అయినా రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం.
ఇటీవల బుల్డోజర్ న్యాయంపై కూడా సుప్రీంకోర్టు వరుసగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా మరోసారి బుల్డోజర్లతో జరుగుతున్న విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. పోలీస్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి దోషి అని తేలినా కూడా వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం తగదని సుప్రీం పేర్కొంది. దోషి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, బుల్డోజర్ తో నాశనం చేయడం వంటివాటితో బాధితులకు న్యాయం జరిగినట్టు భావించలేమని చెప్పింది. ఇక అక్రమ కట్టడాల విషయంలో కూడా అధికారుల తీరుని సుప్రీం ఆక్షేపించింది. అక్రమ కట్టడాలను కూల్చే విషయంలో అధికారులు ముందుగా నోటీసులివ్వాలని చెప్పింది. ఆ నోటీసుల్ని ఇంటికి అతికించి రావడం అలవాటు కాకూడదని, రిజిస్టర్ పోస్ట్ లో పంపించాలని స్పష్టం చేసింది. నోటీసులి ఇవ్వడానికి కూల్చివేతకు మధ్య 10నుంచి 15రోజుల సమయం ఉండాలని, వ్యవధి ఇస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ఒక కట్టడాన్ని కూల్చేసి, మరో కట్టడం జోలికి వెళ్లకపోవడంతోనే సమస్య మొదలవుతుందని చెప్పింది సుప్రీం.
మనది లౌకిక రాజ్యం అని దేశంలోని పౌరులందరికి, దేశంలోని అన్ని సంస్థలకు చట్ట నిబంధనలు సమానంగా ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు. కూల్చివేతలపై అక్టోబర్ 1 వరకు ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయంలో దేశమంతటికీ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపింది సుప్రీం.
Also Read: మరో ప్రాణం తీసిన "పని ఒత్తిడి" - ఐదు పేజీల లేఖ రాసి బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ ఆత్మహత్య