Work Pressure: మరో ప్రాణం తీసిన "పని ఒత్తిడి" - ఐదు పేజీల లేఖ రాసి బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ ఆత్మహత్య
Bajaj Finance Employee Suicide: 'తన ఆత్మహత్య నిర్ణయానికి సీనియర్ మేనేజర్లే బాధ్యులు' అని సూసైడ్ నోట్‌లో తరుణ్ సక్సేనా రాశాడు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులకు సూచించాడు.
Bajaj Finance Manager Suicide: పని ఒత్తిడి భరించలేక ఉద్యోగులు చనిపోతున్న వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. కొన్నాళ్ల క్రితం, ఈవై కంపెనీ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ వర్క్ ప్రెజర్‌తో అనారోగ్యం పాలై చనిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగిని కూడా పని చేస్తూనే ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు, యూపీలోనూ అలాంటి సంఘటనే జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల తరుణ్ సక్సేనా, తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బజాజ్ ఫైనాన్స్‌లో సుమారు ఎనిమిదేళ్లుగా తరుణ్ సక్సేనా పని చేస్తున్నాడు. చనిపోయే ముందు ఐదు పేజీల సూసైడ్ నోట్‌ను రాశాడు.
సూసైడ్ నోట్‌లో ఏం ఉంది?
తన సీనియర్ అధికార్ల నుంచి ప్రెజర్ కారణంగా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడని, వర్క్ టార్గెట్లను పూర్తి చేయకపోవడంతో తనను మానసిక క్షోభకు గురి చేశారని తరుణ్ సక్సేనా సూసైడ్ నోట్‌లో రాశాడు. తనను వేధించిన సీనియర్ ఉద్యోగుల పేర్లను కూడా ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
తరుణ్ సక్సేనా, బజాజ్ ఫైనాన్స్‌లో కస్టమర్ల నుంచి లోన్ EMIలను వసూలు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. లోన్ వసూళ్లలో కంపెనీ ఇచ్చిన టార్గెట్‌లు చేరుకోలేకపోయాడు. గత రెండు నెలలుగా టార్గెట్లను పూర్తి చేయలేకపోయాడు. దీంతో, సీనియర్ అధికార్ల నుంచి ఒత్తిడి పెరిగింది. టార్గెట్లను పూర్తి చేయలేకపోతే జీతం కట్ చేస్తామని, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలని బెదిరించారని సూసైడ్ నోట్‌లో సక్సేనా రాశాడు. పైగా, సీనియర్ అధికార్లు తనను చాలా అవమానించారని వెల్లడించాడు. జీతమైనా తగ్గుతుంది లేదా ఉద్యోగమైనా పోతుందన్న భయంతో గత 45 రోజులుగా సరిగా నిద్ర కూడా పోవడం లేదని పేర్కొన్నాడు. భవిష్యత్తుపై భయంగా ఉందని, అందుకే చనిపోతున్నట్లు తరుణ్ సక్సేనా తన సూసైడ్ నోట్‌లో రాశాడు.
పనిమనిషి వచ్చి చూసేసరికి ఘోరం
సక్సేనా, తన తల్లిదండ్రులు, భార్య మేఘా, పిల్లలు యథార్థ్, పిహుతో కలిసి ఆ ఇంట్లో నివశిస్తున్నాడు. సూసైడ్‌కు ముందు వాళ్లను ఇంట్లోని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. పనిమనిషి వచ్చి చూసేసరికి, ఇంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. ఆ ఇంటికి దగ్గరలోనే ఉండే తరుణ్ సక్సేనా బంధువు గౌరవ్ సక్సేనాకు ఆమె ఈ విషయాన్ని చెప్పింది. గౌరవ్, తరుణ్ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచాడు. పోలీసులకు సమాచారం అందించాడు.
"తరుణ్ సక్సేనా నా కజిన్. బజాజ్ ఫైనాన్స్‌లో ఏరియా మేనేజర్‌గా పని చేశాడు. మార్కెట్ నుంచి మరిన్ని కలెక్షన్లు తీసుకురావాలని కంపెనీ అతనిపై ఒత్తిడి పెంచింది. లక్ష్యాలను చేరుకోనప్పుడు అతని జీతం కూడా తగ్గించింది. ఈ ఉదయం 6:00 గంటలకు, భోపాల్‌లో ఉన్న వైభవ్ సక్సేనా, ప్రభాకర్ మిశ్రా అతనితో సమావేశాన్ని నిర్వహించారు, ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత తరుణ్ సక్సేనా ఆత్మహత్య చేసుకున్నాడు" - గౌరవ్ సక్సేనా
సూసైడ్ నోట్‌లో ఇంకా ఏం ఉంది?
"భవిష్యత్ గురించి నేను చాలా టెన్షన్‌గా ఉన్నాను. నా ఆలోచన కూడా సామర్థ్యాన్ని కోల్పోయాను. నేను వెళ్తున్నాను. సీనియర్ మేనేజర్లు ఒత్తిడి చేస్తున్నారు. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, 45 రోజులుగా నిద్రపోలేదు. పిల్లల స్కూల్ ఫీజు సంవత్సరం మొత్తానికీ చెల్లించాను. మేఘా, యథార్థ్, పిహును జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, నాన్నా.. మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నా కుటుంబం కోసం రెండో అంతస్తు నిర్మించండి."
తన పిల్లలను బాగా చదివించాలని, మేఘాను జాగ్రత్తగా చూసుకోవాలని సూసైడ్ నోట్‌లో రాశాడు. జీవిత బీమా సొమ్ము తీసుకునేందుకు తన కుటుంబానికి సహకరించాలని బంధువులకు సూచించారు.
తాజా సమాచారం ప్రకారం, పోలీసులు ఇంకా FIR ఫైల్ చేయలేదు. మృతుడి కుటుంబం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చనిపోవద్దు - సర్కారు సాయం తీసుకోండి
మీకు తెలిసిన వాళ్లపైనా ఇలాంటి పని ఒత్తిడి ఉండి ఉండొచ్చు. అలాంటి వాళ్లకు సాయం కావాలంటే, ఈ హెల్ప్‌లైన్ నంబర్లలో దేనికైనా కాల్ చేయొచ్చు:
- రోష్ని (హైదరాబాద్) 040-66202000
- ఆసరా (ముంబై) 022-27546669
- స్నేహ (చెన్నై) 044-24640050
- సుమైత్రి (దిల్లీ) 011-23389090
- కూజ్ (గోవా) 0832- 2252525
- జీవన్ (జంషెడ్‌పూర్) 065-76453841
- ప్రతీక్ష (కొచ్చి) 048-42448830
- మైత్రి (కొచ్చి) 0484-2540530
- లైఫ్‌లైన్ 033-64643267 (కోల్‌కతా)
ఇది కూడా చదవండి: పండుగ ముందు వంటింట్లో రేట్ల మంట, గ్యాస్ బండ మరింత భారం