Supreme Court Latest News:ఉచితాలపై ఆధారపడి ప్రజలు పని చేయడం లేదు- ఫ్రీ స్కీమ్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court News:పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వ్యక్తుల ఆశ్రయం పొందే హక్కుకు కేసును ధర్మాసనం విచారిస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ అమలుకు ఎంత టైం పడుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది.

Supreme Court Latest News:ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం (ఫిబ్రవరి 12, 2025) నాడు ఉచిత పథకాలు కారణంగా చాలా మంది పని చేయడానికి ఇష్టపడటం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో దేశంలో పరాన్నజీవుల తరగతి ఏర్పడిందని తెలిపారు. నగరాల్లో నివసిస్తున్న నిరాశ్రయులకు నైట్ షెల్టర్లు కల్పించడానికి సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు రాత్రి పూట ఆశ్రయం కల్పించడంపై దాఖలు చేసిన పిటిషన్ చాలా ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసు విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో, నగరంలో నివసిస్తున్న పేదల గృహనిర్మాణం సహా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఈ కార్యక్రమం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని అటార్నీ జనరల్‌ను కోరింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాససనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలను ఉచితాలకు అలవాటు చేసే బదులు, వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు న్యాయమూర్తులు.
పార్టీల ఓట్ల దురాశతో ఒక తరగతి ఉచితాలకు అలవాటు పడే పరాన్నజీవులుగా మారుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. పని లేకుండా ప్రజలకు ఉచిత రేషన్, డబ్బు ఇవ్వడం సరైనది కాదని తెలిపింది. ఈ ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి, ఫలితంగానే వారు దేశ అభివృద్ధికి దోహదపడతారని అభిప్రాయపడింది.
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మాట్లాడుతూ... ఉచిత రేషన్, డబ్బు ఇచ్చే బదులు, వారిని సమాజ ప్రధాన స్రవంతిలో భాగం చేయడం మంచిదని, తద్వారా వారు దేశాభివృద్ధికి దోహదపడతారని అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతోందని, ఇది పట్టణ నిరాశ్రయులైన పేద ప్రజలకు గృహనిర్మాణం సహా ఇతర విషయాల్లో ఉపయోగపడుతుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు.





















