Satyendar Jain Bail: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఎట్టకేలకు బెయిల్ - మంజూరు చేసిన సుప్రీం కోర్టు
Satyendar Jain Bail: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య పరిస్థిని దృష్టిలో పెట్టుకుని 6 వారాల పాటు బెయిల్ ఇచ్చింది.
Satyendar Jain Bail: ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 6 వారాల పాటు జైన్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ, జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితిని ముందుగా వైద్యుల బృందం పరిశీలించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ హవాలా కేసులో ఈడీ 2022 మే 30న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తీహార్ జైలులో ఉన్న ఆయన ఇటీవల బాత్రూములో పడిపోయారు. ఆయనను వెంటనే ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జైన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వైద్యపరమైన కారణాలతో మాత్రమే ధర్మాసనం సత్యేందర్ జైన్ కు బెయిల్ ఇస్తోందని, తదుపరి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకునేందుకు జులై 10న ఆయన తాజా వైద్య నివేదికను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ ఇస్తూ సత్యేందర్ జైన్ కు పలు షరతులు విధించింది సుప్రీం కోర్టు. బెయిల్ పై బయట ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడకూడదని నిషేధం విధించింది. అలాగే ఢిల్లీని విడిచి పెట్టి వెళ్లకూడదని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివి చేయకూడదని సత్యేందర్ జైన్ కు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా లోక్ నాయక్ హాస్పిటల్ (LNH) నివేదికను విశ్వసించలేమని ఈడీ సుప్రీం కోర్టు ముందు వాదించింది. ముఖ్యంగా అక్టోబర్ లో బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకోవడంలో జైన్ ప్రవర్తన నేపథ్యంలో, ఆయనను ఎయిమ్స్ వైద్యులు పరీక్షించిన తర్వాతే బెయిల్ పై తుది నిర్ణయం తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
'సత్యేందర్ జైన్ ఆరోగ్య మంత్రిగా, జైలు శాఖ మంత్రిగా పని చేశారు. కాబట్టి, ఆయనకు జైలులో వైద్యులు, అధికారులు తెలుసు. కావున ఈ నివేదికలు అన్నీ మోసపూరితంగా ఉండే అవకాశం ఉంది. వాటిపై ఆధారపడి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి లేదు. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో లేని ఎయిమ్స్ లేదా మరో ఆస్పత్రి వైద్యుల బృందం సత్యేందర్ జైన్ ను పరీక్షించాలి. తర్వాతే బెయిల్ పై తుది నిర్ణయం తీసుకోవాలి' అని సుప్రీం కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది రాజు వాదనలు వినిపించారు.
Also Read: 9 Years of Modi Govt: మోదీ సర్కార్‌కి 9 ఏళ్లు, అసలు సిసలు సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయ్!
సత్యేందర్ జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తన క్లయింట్ మెడికల్ రిపోర్టులు ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరం అన్న విషయాన్ని ధృవీకరించాయని సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ' తీహార్ జైలులో జైన్ గాయపడిన తర్వాత రిఫరల్ ఆస్పత్రి అయిన లోక్ నాయక్ కు తీసుకు వచ్చారు. వైద్య నివేదికలు అబద్ధం కావు. మానవతా ప్రాతిపదికన సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి' అని జైన్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదించారు. జైన్ జైలులోకి వెళ్లిన తర్వాత 33 కిలోల బరువు తగ్గారని తెలిపారు. ఆయన వెన్నెపూస శస్త్రచికిత్స చేయుంచుకోవాల్సి ఉందని సుప్రీం కోర్టు బెంచ్ ముందుకు తీసుకొచ్చారు.