9 Years of Modi Govt: మోదీ సర్కార్‌కి 9 ఏళ్లు, అసలు సిసలు సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయ్!
9 Years of Modi Govt: మోదీ సర్కార్ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందున్న సవాళ్లపై చర్చ జరుగుతోంది.
9 Years of Modi Govt:
2014లో ఘన విజయం..
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని కాదని బీజేపీకే పట్టం కట్టారు దేశ ప్రజలు. 300పైగా సీట్లు గెలుచుకుని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 26న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పీఎంగా బాధ్యతలు తీసుకుని 9 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఆయన క్రేజ్ పెరుగుతూ వచ్చింది తప్ప..ఎక్కడా తగ్గలేదు. మొదటి టర్మ్‌లో కన్నా రెండో టర్మ్‌లోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మరింత క్రేజ్ సంపాదించుకున్నారు మోదీ. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చేయడం, ట్రిపుల్ తలాఖ్‌ని తొలగించడం, అయోధ్య రామ మందిర నిర్మాణానికి అప్పటి వరకూ ఉన్న లీగల్ అడ్డంకులను దాటుకుని రావడం లాంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ముఖ్యంగా కశ్మీర్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇదీ 9 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్. అలా అని అంతా "అద్భుతమే" అనడానికి వీల్లేదు. ఇప్పటికీ మోదీ సర్కార్ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు పరిష్కారం చూపించలేకపోతోందన్న విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇవే ఆ సవాళ్లు..
1. నిరుద్యోగిత
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు నిరుద్యోగం. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని లెక్కలతో సహా వివరిస్తున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అన్ని విషయాల్లో గట్టిగా బదులిస్తున్న బీజేపీ...నిరుద్యోగం అంశం దగ్గర మాత్రం కాస్త తడబడుతోంది.
2.ద్రవ్యోల్బణం
ఇక రెండో అతి పెద్ద సవాలు ద్రవ్యోల్బణం. కొన్నేళ్లుగా దేశంలో Inflation తీవ్రంగా పెరుగుతూ వస్తోంది. ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. చమురు ధరలూ విపరీతంగా పెరిగాయి. ఇది సాధారణ పౌరులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ద్రవ్యోల్బణమూ ఓ కారణం అని కొందరు నిపుణులు చెప్పారు.
3. పేదరిక నిర్మూలన
తమ హయాంలో పేదరికం అనేదే లేకుండా చేస్తామని మోదీ సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గతంలో కన్నా పేదల సంఖ్య పెరిగిందని కొన్ని రిపోర్ట్‌లు స్పష్టం చేశాయి. అయితే...ఈ రిపోర్ట్‌లకు క్రెడిబిలిటీ ఉందా లేదా అన్న ప్రశ్న పక్కన పెడితే...ఓ వైపు సంపన్నుల సంపద మరింత పెరుగుతూ వస్తుంటే...పేదలు మాత్రం ఇంకా పేదలుగా మారుతున్నారన్న వాదనలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.
4. రైతుల ఆదాయం రెట్టింపు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ...ఇప్పటి వరకూ ఇదీ జరగలేదన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. కనీస మద్దతు ధర విషయంలోనూ కేంద్రం కాస్త తడబడిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కొత్త రైతు చట్టాలు తీసుకురావడం, వాటిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేయడం కొంత మేర మోదీ సర్కార్‌ని ఇబ్బంది పెట్టాయి. ఆ చట్టాలని రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నప్పటికీ..రైతుల్లో అసహనం ఉందని ప్రతిపక్ష నేతలు తేల్చి చెబుతున్నారు.
5. 5 లక్షల కోట్ల ఎకానమీ
ఆర్థికంగానూ మోదీ సర్కార్ సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా తరవాత ఎకానమీ కుదేలైంది. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చినప్పటికీ...ఈ లక్ష్యం 3.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయింది. ఈ హామీని నెరవేర్చడమే అసలు సిసలు సవాలు.
6. CAA అమలు
నాలుగేళ్ల క్రితమే CAAని తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకూ దీన్ని అమలు చేయలేదు మోదీ సర్కార్. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తడం వల్ల వెనక్కి తగ్గింది. అయితే..ఇప్పటికీ హామీల లిస్ట్‌లో ఇది ఉంది. అమిత్‌షా కూడా చాలా సందర్భాల్లో కచ్చితంగా అమలు చేసి తీరతాం అని స్పష్టం చేశారు. కానీ...అది ఎప్పుడు జరుగుతుందన్నది తేలాల్సి ఉంది.
7. చైనాతో సరిహద్దు వివాదం
చైనాతో సరిహద్దు వివాదం ముదురుతోంది. భారత్ గట్టిగానే బదులిస్తున్నప్పటికీ గల్వాన్ లోయ ఘటన తరవాత రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. ఇటీవల తవాంగ్‌లోనూ భారత సైన్యానికి సవాలు విసిరింది చైనా. ఈ విషయంలో మోదీసర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి.
8. పాకిస్థాన్ వ్యవహారం
చైనాలాగే..పాక్‌తోనూ భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది. ఉగ్రవాదంపై గట్టి చర్యలే తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కశ్మీర్‌లో పండిట్‌లపై మళ్లీ ఉగ్ర దాడులు జరుగుతున్నాయి.
9. లోక్‌సభ ఎన్నికలు 2024
ఇప్పటికే రెండు టర్మ్‌లు కంప్లీట్ చేసుకున్న మోదీ సర్కార్ ఇప్పుడు మూడోసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈసారి ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. మోదీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టనున్నాయి. ఎన్నికలపై ఈ కూటమి ప్రభావం చూపగలిగితే...బీజేపీకి ఎంతో కొంత నష్టం కలగక మానదు.