Patanjali: 'అధికారులు ఇప్పటికి నిద్ర లేచారు' - పతంజలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
Supreme Court: ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ పతంజలి ఉత్పత్తుల తయారీ లైసెన్స్ తాజాగా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు ఇప్పటికి నిద్ర లేచారని అసంతృప్తి వ్యక్తం చేసింది.
Supreme Court Anger On Uk Government In Patanjali Issue: పతంజలి (Patanjali) ప్రకటనల కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వచ్చిన తర్వాత పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కాగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చారని నిర్థారణ అయిన క్రమంలో పతంజలి సంస్థపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సదరు సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ మంగళవారం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
'ఈ వ్యవహారంపై ఏప్రిల్ 10వ తేదీన మేము ఆదేశాలు ఇచ్చాం. ఆ తర్వాత ఉత్తరాఖండ్ అధికారులు నిద్ర మేల్కొన్నట్లు కనిపిస్తోంది. మీరు చేయాలనుకుంటే చాలా త్వరగా చేయగలరు. కానీ అలా చేయలేదు. చేయకూడదు అనుకుంటే పక్కన పెట్టేస్తారు. సదరు సంస్థపై 9 నెలల నుంచి మీరెందుకు చర్యలు తీసుకోలేదు. మీకు సానుభూతి కావాలి అంటే కోర్టుకు నిజాయతీగా ఉండండి.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు, మీరు తీసుకున్న చర్యలు చట్ట ప్రకారం తీసుకున్నారా.? లేదా అనేది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.
'ఒరిజినల్ పేజీలు సమర్పించాల్సిందే'
మరోవైపు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో తాము పత్రికల్లో ఇచ్చిన బహిరంగ క్షమాపణలకు సంబంధించి డిజిటల్ కాపీలను వారు కోర్టుకు అందించారు. అయితే, దీనిపై న్యాయస్థానం వారిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఒరిజినల్ రికార్డులు సమర్పించమంటే డిజిటల్ కాపీలు ఎలా ఇస్తారంటూ నిలదీసింది. ఈ చర్య కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని.. ప్రతీ పత్రికలో ఇచ్చిన ప్రకటనల ఒరిజినల్ పేజీలను కచ్చితంగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ జరిగింది
పతంజలి సంస్థకు సంబంధించిన ఉత్పత్తుల ఆయుర్వేద ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. దీనిపై వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఎన్నిసార్లు మందలించినా సంస్థ తీరు మారడం లేదంటూ అక్షింతలు వేసింది. దీనిపై పతంజలి వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబాతో పాటు ఆచార్య బాలకృష్ణ స్పందించారు. కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయితే, పేపర్లలో పతంజలి ప్రకటనలు ఎంత సైజులో వేస్తారో అదే సైజ్ లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 'unconditionally apologise' పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు వేయించింది. 'ఇప్పటివరకూ మా ప్రకటనల్లో వచ్చిన తప్పులకు క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం.' అంటూ పేర్కొంది. తాజాగా, ఆ సంస్థ ఉత్పత్తుల లైసెన్స్ ను యూకే ప్రభుత్వం రద్దు చేసింది.
Also Read: Amit Shah: రిజర్వేషన్ల రద్దుపై తన మాటలు వక్రీకరణ, కాంగ్రెస్‌పై అమిత్ షా ఆగ్రహం