Sedition Law: రాజద్రోహం చట్టం గురించి తెలుసా? అభియోగాలు మోపిన కేసుల్లో నిరూపణ అయినవి ఇంతేనా!
Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అసలు ఈ చట్టంలో ఏముంది? ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేర నిరూపణ అయినవి ఎన్ని?
Sedition Law:
దేశంలో అత్యంత వివాదాస్పదమై శాసనాల్లో రాజద్రోహం చట్టం ఒకటి. బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన ఈ చట్టాన్ని స్వాతంత్య్రం సాధించిన తర్వాత కూడా కొనసాగించడంపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. అసలు ప్రస్తుతం ఈ చట్టం అవసరం ఏముందని పలువురు సామాజిక కార్యకర్తలు, పలు సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా ప్రశ్నించారు.
ఈ చట్ట నిబంధనలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలే ఎక్కువున్నాయి. తాజాగా ఈ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ చట్టంలో ఏముంది? ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేర నిరూపణ శాతం ఎంత?
తాజా కేసు
2022, ఏప్రిల్ 24 - మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాపై ముంబయి పోలీసులు రాజద్రోహం కింద అభియోగాలు మోపారు. ప్రభుత్వంపై విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించినందుకు ఈ అభియోగాలు మోపినట్లు తెలిపారు.
నేర నిరూపణ శాతం ఎంత?
2014 నుంచి 2020 - రాజద్రోహం కింద నమోదైన కేసులు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ నేర నిరూపణ శాతం మాత్రం 2.25 శాతమే.
సంవత్సరం |
నమోదైన కేసులు |
ఛార్జ్ షీట్ చేసిన కేసులు |
దోషిగా తేల్చిన కేసులు |
విచారణ పూర్తి |
2014 |
47 |
14 |
1 |
4 |
2015 |
30 |
6 |
0 |
4 |
2016 |
35 |
16 |
1 |
3 |
2017 |
51 |
27 |
1 |
6 |
2018 |
70 |
38 |
2 |
13 |
2019 |
93 |
40 |
1 |
30 |
2020 |
73 |
28 |
3 |
6 |
Total |
399 |
169 |
9 |
66 |
రాజద్రోహం చట్టం
ఐపీసీలోని సెక్షన్ 124A, 1860
భారత శిక్షాస్మృతిలోని 124 ఏ సెడిషన్ చట్టం ప్రకారం మాటలు, రాతలు, సైగల ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించినా, ప్రేరేపించినా వారికి జరిమానా, జీవిత ఖైదు విధించే వీలుంది.
అభియోగ తీవ్రతను బట్టి మూడేళ్ల జైలు లేదా జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది.
భారత్ సహా సౌదీ అరేబియా, సుడాన్, ఇరాన్ వంటి పలు దేశాల్లో రాజద్రోహం చట్టం ఇంకా ఉంది.
లా కమిషన్ ఏం చెప్పింది?
ప్రభుత్వాన్ని హింస ద్వారా లేక అక్రమంగా కూలదోయడానికి ప్రయత్నించినా ప్రజా జీవితాన్ని ఛిద్రం చేయాలని చూసిన వారిపై మాత్రమే సెక్షన్ 124A అభియోగాలను మోపాలని 2018లో లా కమిషన్ పేర్కొంది.
చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో పాలసీలపై చర్చ జరగడం, విమర్శలు రావడం అవసరమని లా కమిషన్ అభిప్రాయపడింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకునే ప్రతి చర్యను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని లా కమిషన్ చెప్పింది.
చర్చించాలి - ఈ అంశాలపై చట్టంపై అవగాహన ఉన్న వాళ్లు, చట్ట సభ్యులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు, సాధారణ పౌరుల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. దాని ద్వారానే ఓ ప్రజాకర్షక మార్పు వస్తుందని లా కమిషన్ అభిప్రాయపడింది.
రద్దు చేసిన దేశాలు
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)– 2009లో ఈ చట్టాన్ని బ్రిటన్ రద్దు చేసింది.
ఆస్ట్రేలియా - 2010లో ఆస్ట్రేలియా ఈ చట్టాన్ని రద్దు చేసింది.
స్కాట్లాండ్ - 2010లో స్కాట్లాండ్ రాజద్రోహం చట్టాన్ని రద్దు చేసింది.
దక్షిణ కొరియా - 1988లో దక్షిణ కొరియా ఈ చట్టాన్ని వద్దనుకుంది.
ఇండోనేసియా - ఈ చట్టం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఇండోనేసియా 2007లో ఈ చట్టాన్ని రద్దు చేసింది.