Lakhimpur Case: లఖింపుర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ.. సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించిన కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. యూపీ పోలీసుల దర్యాప్తుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును విచారించాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనలో జరిగిన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం లఖింపుర్ ఘటనకు సంబంధించిన కేసుపై గురువారం విచారణ చేపట్టనుంది. యూపీ పోలీసుల దర్యాప్తుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఈ కేసుకు సంబంధించి సీబీఐతో దర్యాప్తు చేయించాలిన విన్నవిస్తూ... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం విదితమే. ఘటనకు బాధులైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని లేఖలో కోరారు. న్యాయవాదుల లేఖను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
Also Read: సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ప్రియాంకతో కలిసి లఖింపుర్‌కు పయనం
అసలేం జరిగిందంటే? ..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. లఖింపుర్ ఖేరిలో రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. తికోనియా-బన్బీపుర్ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ దారుణ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే కన్నుమూశారు. అనంతరం రైతుల దాడిలో మరో నలుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రాపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: వచ్చే 5 ఏళ్లలో 7 పీఎం మిత్రా పార్కులు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం..
లఖింపుర్ ఖేరీ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఘటన జరిగిన సమయంలో తాను, తన కుమారుడు అక్కడ లేమని స్పష్టం చేశారు. తమ కారును వేరే దారిలో మళ్లించారని చెప్పారు. ఎలాంటి ప్యానెల్ ముందైనా సాక్ష్యం చెప్పేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఈ ఘటనను అన్ని కోణాల నుంచి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని వ్యాఖ్యానించారు.
Read More: 'నేను, నా కుమారుడు ఆ కారులో లేం.. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం'
Also Read: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్