Sachin National Icon: సచిన్‌తో ఎన్నికల కమిషన్ టై అప్, నేషనల్ ఐకాన్‌గా నియామకం
Sachin National Icon: భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్, సచిన్ టెండూల్కర్‌కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం జరుగనుంది.
Sachin National Icon: భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్, సచిన్ టెండూల్కర్‌కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం జరుగనుంది. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సచిన్ ఓటర్లు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.
ప్రస్తుతం దేశంలో 94.50 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. సుమారు దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల శాతం ఆరు రెట్లు పెరిగింది.
మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, యువతతో పాటు వలస వెళ్లిన వారు ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో చైతన్యం నింపేందుకు, ఓటు ప్రాముఖ్యతను వివరించేందుకు ఈసీ నేషనల్ ఐకాన్ పేరుతో ప్రముఖులతో అవగాహన కుదుర్చుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది.
అవగాహన ఒప్పందంలో భాగంగా సచిన్ మూడేళ్ల పాటు ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం, సచిన్ సంయుక్తంగా కృషి చేస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదవుతోంది. పట్టణ ప్రజలు, యువత ఓటింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. వారిలో అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది.
సచిన్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడంతో ఆయన చెబితే ప్రభావం ఉంటుందని ఈసీ నమ్ముతోంది. ముఖ్యంగా పట్టణ యువతను సచిన్ ప్రభావితం చేయగలరని ఈసీ ఈసీ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. సచిన్‌కు ఉన్న ఫాలోయింగ్ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దోహద పడుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సచిన్‌తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది.
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రసిద్ధి చెందిన వ్యక్తులను ‘నేషనల్ ఐకాన్’గా నియమిస్తుంది. వీరి ద్వారా ప్రజలు ఓటింగ్ పక్రియలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎమ్ఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీ కోమ్ 'నేషనల్ ఐకాన్'గా వ్యవహరించారు. 2022లో పంకజ్ త్రిపాఠీని నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యారు.
ఇదీ సచిన్ ట్రాక్ రికార్డ్
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇది ప్రపంచంలో సాటిలేని రికార్డు. మొత్తం 664 మ్యాచ్‌ల్లో 48.52 సగటుతో, 67 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 100 సెంచరీలు చేశారు. 164 అర్ధ శతకాలు బాదారు. మొత్తం 34,357 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డులకెక్కారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ చరిత్రలో చెదరని చరిత్రను లిఖించారు. అంతేకాకుండా.. ఆరు ప్రపంచ కప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2011 ప్రపంచ కప్ గెలవడంలో కీలక బాధ్యత వహించాడు.