Rohith Vemula Bill: 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.1 లక్ష జరిమానా! రోహిత్ వేముల బిల్లు రెడీ చేసిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల (విద్య, గౌరవ హక్కు) బిల్లు, 2025ను తీసుకురావాలని చూస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో కర్ణాటక అసెంబ్లీలో ఈ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

బెంగళూరు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చేసిన సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో బిల్లును సిద్ధం చేసింది. ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 2016లో కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల (మినహాయింపు లేదా అన్యాయం నివారణ) (విద్య, గౌరవ హక్కు) బిల్లు, 2025 ను కర్ణాటక ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులపై వివక్షను నిరోధించే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రోహిత్ వేముల బిల్లు (Rohith Vemula Bill)లో పేర్కొన్న అంశాలివే..
- రోహిత్ వేముల బిల్లు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన విద్యార్థులను సామాజిక, ఆర్థిక, మత ఆధారంగా బహిష్కరణ, అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. SC/ST విద్యార్థులను ప్రవేశం నిరాకరించడం, వారి నుంచి డబ్బు డిమాండ్ చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని అరికడుతుంది.
- పైన పేర్కొన్న వర్గాల విద్యార్థులపై నేరం జరిగితే బెయిల్ లేని కేసులు నమోదు చేసేలా చట్టం. వివక్ష చూపే ప్రతి వ్యక్తితో పాటు దానికి సంబంధించిన వారు, సహాయం చేసిన వారు శిక్షకు గురవుతారు.
- నేరాల వేగవంతమైన విచారణను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం. అందుకుగానూ ప్రతి ప్రత్యేక కోర్టుకు కనీసం 1 ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను, హైకోర్టులోని ప్రతి బెంచ్‌లో ఒకరిని నియమించేందుకు రోహిత్ వేముల బిల్లు వీలు కల్పిస్తుంది.
- రోహిత్ వేముల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే మొదటి నేరం రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష, ₹10,000 జరిమానా విధిస్తారు. బాధితుడికి ₹1 లక్ష వరకు పరిహారం అందించేలా నిందితులను ఆదేశించే అవకాశం ఉంది.
ఈ చట్టం కింద మరో నేరం రుజువైతే నిందితుడికి 3 సంవత్సరాల జైలుశిక్ష, ₹1 లక్ష జరిమానా సైతం విధిస్తూ తీర్పు ఇవ్వవచ్చు.
- ఏదైనా విద్యా సంస్థ అన్ని కులాలు, మతం, లింగం, జాతికి ఒకేతీరుగా తలుపులు తెరిచి ఉండాలి అనే రూల్ ఉల్లంఘిస్తే వారికి సైతం ఇదే శిక్షే పడుతుంది.
- రోహిత్ వేముల బిల్లు చట్టంగా మారితే, నిబంధనలను ఉల్లంఘిస్తున్న అలాంటి సంస్థకు కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం లేదా గ్రాంట్ అందించదు.
- ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత పక్షపాతాన్ని నివారించడానికి రోహిత్ వేముల పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావాలని లేఖలో సూచించారు. విద్యా వ్యవస్థలో, విద్యా సంస్థల్లో అణగారిన వర్గాలు ఎటువంటి వివక్షను ఎదుర్కోకుండా చూసేందుకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందని సిద్ధరామయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రోహిత్ వేముల బిల్లుఈ విషయాన్ని పేర్కొంది. అది కార్యరూపం దాల్చడానికి నేతలు చర్యలు చేపట్టారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.






















