40 అడుగుల ఎత్తున్న గోడ దూకి జంప్, జైలు నుంచి తెలివిగా తప్పించుకున్న ఖైదీ - సీసీ ఫుటేజ్ వైరల్
Rape Accused Escape: కర్ణాటకలోని ఓ జైలు నుంచి అత్యాచార నిందితుడు తప్పించుకున్నాడు.
Rape Accused Escape:
జైలు దూకిన ఖైదీ..
కర్ణాటకలోని దవన్‌గెరె సబ్ జైల్ నుంచి ఓ అత్యాచార నిందితుడు తప్పించుకున్నాడు. సినిమా స్టైల్‌లో 40 అడుగులు ఎత్తున్న గోడపై నుంచి దూకి పారిపోయాడు. దూకీ దూకగానే కాలు విరిగింది. అయినా అలాగే లేచి కుంటుకుంటూ రోడ్డు మీదకు వెళ్లి ఓ ఆటో ఎక్కి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కరూర్ ప్రాంతానికి చెందిన వసంత్‌పై రెండ్రోజుల క్రితం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా వసంత్‌ని అరెస్ట్ చేశారు. జైల్లో రెండ్రోజులున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం గోడ ఎక్కాడు. అంత ఎత్తున్నా పట్టించుకోకుండా తప్పిచుకోవాలని దూకాడు. నేలకు కాలు బలంగా తాకింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పలు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. 24 గంటల్లోగా మళ్లీ అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు అన్ని చోట్లా గాలించిన పోలీసులు హవేరిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. హరియాణాలో కురుక్షేత్ర జిల్లాలోని జైలు నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు. మెయింటేనెన్స్ వర్క్ జరుగుతుండగా అధికారుల కళ్లు గప్పి పారిపోయారు.
మధ్యప్రదేశ్‌లో అత్యాచార ఘటన..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి సత్ప్రవర్తన కింద ఏడాది క్రితమే విడుదలైన ఓ వ్యక్తి
మరోసారి అదే దారుణానికి పాల్పడ్డాడు. సత్నా జిల్లాలోని ఓ బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడు రాకేశ్ వర్మ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉంది. మెరుగైన చికిత్స అందించేందుకు రెవా మెడికల్ కాలేజ్‌కి తరలించారు. సిటీ సూపరింటెండెంట్ పోలీస్ (CSP) మహేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించిన వివరాల ప్రకారం...12 ఏళ్ల క్రితం నిందితుడు రాకేశ్ వర్మ ఓ నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఏడేళ్ల జైలు శిక్ష తరవాత సత్ర్పవర్తన కింద ముందుగానే విడుదల చేశారు. ఏడాదిన్నర క్రితమే జైలు నుంచి విడుదలై వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
"నిందితుడు రాకేశ్ వర్మ బాలికకు ఏవేవో మాయ మాటలు చెప్పి బుజ్జగించాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వేరే చోటకు తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలోనే ఈ విషయం తెలిసింది. బాధితురాలికి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించాం. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఈ కేసుపై పూర్తి విచారణ కొనసాగుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం"
- మహేంద్ర సింగ్ చౌహాన్, సీఎస్‌పీ
Also Read: రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్న బీజేపీ, ప్రధాని అభ్యర్థి అంటూ గహ్లోట్ చేసిన ప్రకటనపై సెటైర్లు