Pratapgarh: నగ్నంగా ఊరేగించిన గిరిజన మహిళకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం- రాజస్థాన్ సీఎం
Pratapgarh: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో నగ్నంగా ఊరేగించిన గిరిజన మహిళకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
Pratapgarh: రాజస్థాన్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ 21 ఏళ్ల బాధిత గిరిజన మహిళను పరామర్శించారు. ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి.. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని బాధిత మహిళకు హామీ ఇచ్చారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే బాధిత మహిళను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చిన సీఎం అశోక్ గెహ్లోత్.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
'మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన కేసులో సిట్ ఏర్పాటు చేశాం. పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. నేను బాధితురాలి కుటుంబంతో మాట్లాడాను. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరుగుతుందని వారికి హామీ ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమె తండ్రి కూలీ పనులు చేస్తాడు. వారికి చాలా నిరుపేద కుటుంబం. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు బాధిత మహిళ పేరు మీద రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాం' అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తెలిపారు.
ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ధరియావాడ తాలూకాలో ఓ గిరిజన మహిళను భర్త, అత్తమామలే వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో సంచలనంగా మారింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో అత్తింటి వారు ఇలాంటి అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. అత్తింటి వారు ఆమెను కిడ్నాప్ చేసి వారి గ్రామానికి తీసుకొచ్చి మరీ వివస్త్రను చేసి ఊరేగించారు. అంతేకాకుండా దారుణంగా వీడియో తీశారు. ఆమె దయనీయ స్థితిలో వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్ గా మారడంతో రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఆరు బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: G20 Summit: మోదీ- బైడెన్ ద్వైపాక్షిక భేటీ, G20 సదస్సుకు ఒక్క రోజు ముందు చర్చలు
ఈ ఘటనలో బాధిత మహిళ భర్తతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధంతో ఉన్నట్లు భావిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రతాప్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ లో వేధింపులు, దాడి, ఇతర సంబంధిత సెక్షన్ల కింద 10 మంది పేర్లు ఉన్నాయని డీజీపీ ఉమేష్ మిశ్రా పేర్కొన్నారు. బాధిత మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తితో అలాంటి సంబంధం పెట్టుకోవడంతో మహిళ భర్త, అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గురువారం ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారని, దానిని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ధరియావాడ్ ఎస్‌హెచ్‌వో పెషావర్ ఖాన్ వెల్లడించారు.