Women Reservation Bill: కుల గణనపై చర్చ జరగొద్దనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు: రాహుల్ గాంధీ
Women Reservation Bill: దేశంలో కుల గణనపై చర్చ జరగకుండా ఉండేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును వీలైనంత త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్, జనాభా లెక్కల నిబంధనలను బిల్లు నుంచి తొలగించి వెంటనే అమలు చేయాలన్నారు. జనాభా దామాషా ప్రకారం ఓబీసీలు సక్రమంగా భాగస్వామ్యమయ్యేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కోరారు. దేశంలో కుల గణన నుంచి దృష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ అగ్ర నేత వ్యాఖ్యానించారు.
'మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా గొప్పది. కానీ జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ జరగాలని మెలిక పెట్టారు. ఈ రెండూ జరగడానికి సంవత్సరాలు పడుతుంది. నిజంగా అమలు చేయాలనుకుంటే వెంటనే చేసేయొచ్చు. అదేమంత సంక్లిష్టమైన విషయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అలా చేయడం ఇష్టం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశం ముందు ప్రదర్శించారు కానీ.. 10 సంవత్సరాల తర్వాతే అమలు చేస్తారు. అసలు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారో లేదో కూడా ఎవరికీ తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చను మళ్లించే వ్యూహాం మాత్రమే' అని రాహుల్ గాంధీ అన్నారు.
కుల గణన జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారని రాహుల్ అన్నారు. దీంతో ఓబీసీ కుల గణన నుంచి దృష్టిని మళ్లించారని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు అమలు చేస్తామనడంలో అర్థం లేదని చెప్పారు.
ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని రాహుల్ అన్నారు. భారత ప్రభుత్వాన్ని నడిపించే క్యాబినెట్ సెక్రటరీలు, కార్యదర్శులు.. 90 మందిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని తెలిపారు. ఎప్పుడూ ఓబీసీల గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. వారి కోసం ఏం చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
'ఓబీసీల కోసం తానెంతో పని చేస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు. అలా అయితే, 90 మంది బ్యూరోక్రాట్లలో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారెందుకు?' అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
రాజ్యసభలోనూ మహిళా బిల్లు ఆమోదం
రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు పడగా, ఒక్కటి కూడా వ్యతిరేక ఓటు పడలేదని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం గురువారం (సెప్టెంబరు 21) రాత్రి 10 గంటల సమయంలో ఆటోమేటెడ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఈ చారిత్రక బిల్లును రాజ్యసభలో ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆ మర్నాడు 20న చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు చర్చ తర్వాత మ్యాన్యువల్ ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభలో 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా (ఎంఐఎం ఎంపీలు) ఓటు వేశారు. ఇప్పుడు ఉభయ సభల్లో చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లు అయింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం (సెప్టెంబర్ 21) రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లుకు అనుకూలంగా 214 ఓట్లు వచ్చాయి. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లుపై ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.