Rath Yatra 2024: పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
Rath Yatra In Puri | ఒడిశాలోని జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోగా, వందలాది భక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Stampede at Puri Rath Yatra | భువనేశ్వర్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని రథ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. జూలై 7న జరిగిన ప్రధాన రథయాత్రలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతిచెందగా, వందలాది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం తొక్కిసలాట లాంటివి జరగలేదని, తగిన శ్వాస అందకపోవడంతో ఒకరు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. జగన్నాథుని రథం లాగుతూ అస్వస్థతకు గురై చనిపోయాడని సైతం ప్రచారం జరుగుతోంది.
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒడిశాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. బలభద్ర స్వామి వారి రథాన్ని లాగుతున్న సమయంలో ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒడిశా టీవీలో వచ్చిన వార్తల ప్రకారం.. జగన్నాథుని రథాన్ని లాగే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భక్తులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భక్తుడిని పూరీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే భక్తుడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
సెయింట్ జాన్ అంబులెన్స్ సర్వీస్ అసిస్టెంట్ కమాండెంట్ సుశాంత్ కుమార్ పట్నాయక్ మాట్లాగుతూ.. రథాన్ని లాగుతున్న క్రమంలో ఓ భక్తుడు అస్వస్థతకు లోనై స్పృహ కోల్పోయాడు. అతడు కార్డియాక్ అరెస్ట్ కూడా కాలేదు. పల్స్ కొట్టుకుంటోంది. బాధితుడ్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాం. CPR చేసినా అతడిలో ఎలాంటి చలనం లేదు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయాడని’ ప్రకటించినట్లు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న మరో 300 మందికి పైగా భక్తులు పూరీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరు నేటి రాత్రిలోగా డిశ్ఛార్జ్ కానున్నారని ఒడిశా ఆరోగ్య కార్యదర్శి వెల్లడించారు. ఒకే చోట ఎక్కువ సంఖ్యలో ఉండటం ద్వారా ఊపిరి అందక అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.