Presidential Elections 2022 : రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం, ఎంపీ, ఎమ్మెల్యేలే ఓటర్లు
Presidential Elections 2022 : రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు(జులై 18) ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Presidential Elections 2022 : రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు, సాధారణ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలనే పోలింగ్ కేంద్రాలుగా మార్చి, రాష్ట్రపతిని బ్యాలెట్ పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరగనుంది,ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువ ఎంత? వారి ఓటును ఎలా గుర్తిస్తారనేది చాలా మందికి తెలియని విషయం. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు. ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు విభిన్న ఓటు విలువ కలిగి ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా రెండు రకాల బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆకుపచ్చ, పింక్ రంగులతో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి.
ఆకుప్చ, పింక్ పేపర్లు
వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చేరుకున్నాయి. ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్‌లో ఎంపీలు, పింక్ పేపర్‌లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు. బ్యాలెట్ పేపర్ రంగు ద్వారా అది ఏ ప్రజాప్రతినిధిదో గుర్తించి వారికి ఉన్న ఓటు విలువ పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్థారిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా ఝార్ఖండ్-తమిళనాడు రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ మొత్తంగా 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
ఏపీ అసెంబ్లీలో తొలి సారిగా రాష్ట్రపతి ఎన్నిక
ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలీంగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లను రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకులు చంద్రేకర్ భారతి, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షించారు. అనంతరం సచివాలయం 5వ బ్లాక్ లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఛాంబర్ లో వారంతా కొంత సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను వారికి వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ నేతృత్వంలో వారంతా ఆంధ్రప్రదేశ్ శాసన సభా ప్రాంగణానికి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు అక్కడ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించారు.