PM Vishwakarma Yojana: తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్.. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు వీరే..
Union Govt Schemes: కేంద్రం పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా కళాకారులకు శిక్షణతో పాటు తక్కువ వడ్డీకి 3 లక్షల వరకు రుణం అందిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ విషయాలు తెలుసుకోండి.

PM vishwakarma yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలను అయలు చేస్తుంది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, కళాకారులకు కూడా ఈ పథకాల ప్రయోజనం లభిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో ప్రజలకు వారి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తారు, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు కూడా లభిస్తాయి.
ఈ పథకం పేరు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన. ఈ స్కీం లక్ష్యం సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తులపై ఆధారపడి పనిచేసే వారిని ప్రోత్సహించడం. ఈ వ్యక్తులు తమ నైపుణ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి సొంతంగా పని ప్రారంభించాలని, సొంతంగా తమ కాళ్లపై నిలబడేలా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో ఎవరెవరు, ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.
PM విశ్వకర్మ యోజన అంటే ఏమిటి?
ప్రత్యేకంగా దేశంలోని సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారుల కోసం ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన. సాంప్రదాయంగా పనిచేసే వ్యక్తులకు ఈ పథకం ద్వారా శిక్షణతో పాటు ఆర్థిక సహాయం చేస్తారు. శిక్షణ సమయంలో రోజువారీ స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ తర్వాత, ప్రభుత్వం టూల్ కిట్ కోసం రూ. 15 వేల వరకు ఇస్తుంది.
తద్వారా వారు తమ పని, వృత్తికి అవసరమైన పనిముట్లను కొనుగోలు చేయవచ్చు. అనంతరం వారికి తొలి విడత రుణం 1 లక్ష రూపాయల వరకు, రెండో విడత రుణం రూ.2 లక్షల వరకు ఇవ్వనున్నారు. ఈ రుణాలపై వడ్డీ రేటు కేవలం 5% మాత్రమే. సాధారణంగా బ్యాంకుల్లో ఈ వడ్డీ రేటు 10 నుండి 12 శాతం వరకు ఉంటుంది.
ఎవరికీ ప్రయోజనం
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద దేశంలోని 18 రకాల సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు ప్రయోజనం చేకూరుతుంది. తమ చేతులతో పని చేసే వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. స్వర్ణకారుడు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేస్త్రి, చెప్పులు కుట్టేవారు, టైలర్, క్షురకుడు, నేత కార్మికుడు, చేనేత కార్మికుడు, తోలు పని చేసేవారు, బుట్టలు తయారు చేసేవారు, చేపల వలలు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, పడవలు తయారు చేసేవారు, రాతి బొమ్మలు చెక్కేవారు, బొమ్మలు లేదా అలంకరణ వస్తువులు తయారు చేసే కళాకారులు అర్హులు.
వీరందరికీ పీఎం విశ్వకర్మ పథకం కింద శిక్షణ, ఆధునిక టూల్కిట్, చాలా తక్కువ వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ వ్యక్తులు తమ సాంప్రదాయ పనిని కొత్త సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవాలని, సొంతంగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందాలి
ఒక వ్యక్తి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే అతను PM విశ్వకర్మ యోజన పోర్టల్ లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, వారి పనికి సంబంధించిన సర్టిఫికేట్ అవసరం. దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం మీ అప్లికేషన్ పరిశీలిస్తుంది. అర్హులైన వ్యక్తులకు శిక్షణ, లోన్ అందిస్తుంది.
ఈ పథకం సాంప్రదాయ నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది. చిన్న కళాకారులను స్వయం ఆధారితంగా మార్చడానికి, స్థానిక ఉపాధిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. భవిష్యత్తులో దేశంలోని లక్షలాది మంది కళాకారులను ఈ పథకంతో అనుసంధానం కావాలని, వారి నైపుణ్యంతో ఆదాయం పొందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వేల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.






















