Physical Literacy Supreme Court : ప్రాథమిక హక్కుగా "ఫిజికల్ లిటరసీ" - కేంద్రం, రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలన్న సుప్రీం కోర్టు !
ఫిజికల్ లిటరసీని ప్రాథమిక హక్కుగా మార్చాలా లేదా అన్నదానిపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర, రాష్ట్రాలను సుప్రీంకోర్టు కోరింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద చిన్నారులకు ఫిజికల్ లిటరసీ ప్రాథమిక హక్కుగా నిర్ణయించవచ్చో లేదో తమ అభిప్రాయాలను కేంద్రం, రాష్ట్రాలు ఈ అంశంపై అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న గోపాల్ శంకర్‌నారాయణన్‌కు తెలియచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. క్రీడల్ని ప్రాథమిక హక్కుగా నిర్ధారించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనం...ఇప్పటికే అమికస్ క్యూరీ గోపాల్ శంకర్ నారాయణన్ ద్వారా నివేదిక తెప్పించుకుంది. అమికస్ క్యూరీ శారీరక అక్షరాస్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇతో సహా అన్ని విద్యా బోర్డులు ప్రతి పాఠశాల రోజులో కనీసం 90 నిమిషాలు " ఆటలకు" అంకితం చేయాలని కోరాలని సుప్రీంలో సమర్పించిన నివేదిక పేర్కొంది.
క్రీడలను ప్రాథమిక హక్కులలో భాగంగా చేయడంతో పాటు దేశంలో క్రీడా విద్యను ప్రోత్సహించేలా కేంద్రం మరియు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలనకి సూచించారు. క్రీడా పరిశోధకురాలు కనిష్క పాండే దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై 2018 ఆగస్టులో సుప్రీం కోర్టు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది మరియు ఆ తర్వాత శంకర్నారాయణన్‌ను అమీకస్‌గా నియమించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు సూచించింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవితం మరియు స్వేచ్ఛ యొక్క రక్షణ) ద్వారా ప్రాథమిక హక్కుగా భౌతిక అక్షరాస్యత గుర్తించా లి" అనే సూచన చేశారు.
పాఠ్యాంశాల రూపకల్పన, సమ్మతి పర్యవేక్షణ మరియు సమీక్ష, ఫిర్యాదుల పరిష్కారం మరియు స్వీయ-దిద్దుబాటు విధానాలతో వ్యవస్థను ఏర్పాటు చేయడం, అమలు చేయడం ద్వారా హక్కును అమలు చేయడానికి జాతీయ భౌతిక అక్షరాస్యత మిషన్ ని ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవన్ కింద క్రీడలు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. అయితే ఇప్పుడు క్రీడల పేరును ఫిజికల్ లిటరసీగా మార్చి ప్రాథమిక హక్కుగా చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సూచనల మేరకు.. కేంద్ర, రాష్ట్రాలు తమ అభిప్రాయాలను అమికస్ క్యూరీకి తెలియచేస్తే.. ఆ మేరకు ఏకాభిప్రాయం ఉంటే.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.
మన దేశంలో చదువులు అంటే.. పాఠ్య పుస్తకాల విజ్ఞానమే అనుకునేవారు ఎక్కువ . పిల్లలకు ఆటలు అవసరం లేదనుకునేవారు మరీ ఎక్కువ. ఈ కారణంగా దేశంలో ఆటలతో పాటు శారీరక విజ్ఞానం కూడా తక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ దిశగా సుప్రీంకోర్టులో పిల్ విచారణతో ప్రాథమిక హక్కుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.