PM Modi: ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్, అండగా ఉంటామన్న భారత్
హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ ఖండిస్తుందన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారు. హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ ఖండిస్తుందన్నారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు హెచ్చరించారు. యుద్ధాన్ని తాము మొదలుపెట్టకపోయినా, ముగించేది మాత్రం తామేననన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తో పాటు, ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు.
దాడులతో దద్దరిల్లిన గాజా
ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన దాడులతో గాజా దద్దరిల్లిపోయింది. దాదాపు 790 హౌసింగ్ యూనిట్లు కుప్పకూలగా.. దాదాపు 5,330 ఇళ్లు దెబ్బతిన్నట్లు ఇంజ్రాయెల్ ప్రకటించింది. మూడు తాగునీటి, పారిశుద్ధ్య విభాగ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. వీటిల్లో మిలిటెంట్ల ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్‌మెంట్ భవనాన్ని కూడా కూల్చివేసినట్లు పేర్కొంది. దీంతోపాటు పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశామని వెల్లడించింది. పాలస్తీనా వాసులు గాజా పట్టీ నుంచి వీలైనంత త్వరగా ఈజిప్ట్ వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు...ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది.
1500 మిలిటెట్లు హతం
మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం దీటుగా ప్రతిఘటించింది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేసింది. దాదాపు 1500 మంది ముష్కరులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, సరిహద్దుల వెంబడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోకి వచ్చిందని ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన అత్యంత పాశవిక మారణహోమంలో మృతుల సంఖ్య 900కు చేరుకుంది. అటు గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు పెరిగినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. హమాస్ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు కీలకమైన మందుగుండు, మిలిటరీ పరికరాల డెలివరీని ప్రారంభించింది. ఇప్పటికే విమాన వాహకనౌక, యుద్ధ నౌకలను...ఇజ్రాయెల్ తీరానికి పంపించింది అమెరికా.
వ్యూహం మార్చి దెబ్బకొట్టిన హమాస్
ఇజ్రాయెల్‌పై భారీ దాడికి కుట్ర పన్నుతున్నట్లు ఏమాత్రం బయటకు పొక్కనీయకుండా హమాస్ జాగ్రత్త పడింది. ఇజ్రాయెల్‌తో తాము పోరాటానికి సిద్ధంగా లేమనే సంకేతాలు గత కొన్నాళ్లుగా హమాస్ నుంచి వస్తున్నాయి. ఇటీవల చిన్న చిన్న పాలస్తీనా గ్రూపులకు, ఇజ్రాయెల్‌సేనలకు మధ్య జరిగిన ఘర్షణల్లో కూడా హమాస్ తలదూర్చలేదు. పీఐజే, ఇతర సంస్థలు జరిపన దాడుల్లో పాల్గొనేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దళాలు హమాస్‌పై కన్నేసి ఉంచినా.. అటు వైపు నుంచి ఎటువంటి దాడి యత్నాలు లేకపోవడంతో సంతృప్తి చెందింది. అదే సమయంలో గాజా వాసులు అధిక ఆదాయం పొందేందుకు ఇజ్రాయెల్‌లో పనిచేసేలా ఎక్కువ పర్మిట్లు సాధించడంపైనే తమకు ఆసక్తి ఉందన్నట్లు టెల్ అవీవ్‌ను నమ్మించింది.
వెయ్యి మందికి శిక్షణ
ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్, ఐడీఎఫ్ బలగాలను ఏమార్చే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది హమాస్. హమాస్‌లోని అత్యంత సీనియర్ కమాండర్లలో అతి కొద్ది మందికి మాత్రమే ఇజ్రాయెల్‌పై దాడి వ్యూహం తెలుసని హమాస్ నేత అలీ బరాఖే వెల్లడించారు. జీరో అవర్ గురించి అతి తక్కువ మంది హమాస్ కమాండర్లకు మాత్రమే తెలుసని...లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇరాన్ గ్రూపులు గతంలో హమాస్‌కు సాయం చేసేవని తెలిపాడు. హమాస్ అగ్రనేతలకు ఇజ్రాయెల్‌పై దాడి ప్లాన్ తెలిసినా బయటకు రానీయలేదు. దాదాపు 1000 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొనేలా శిక్షణ ఇచ్చారు. అందులో పాల్గొన్న వారికి కూడా తమకు ఎందుకు శిక్షణ ఇస్తున్నారో తెలియనీయలేదు. ఇజ్రాయెల్‌లోని కాలనీల వంటి ప్రదేశాలను నిర్మించి అక్కడ దాడి చేయడం నేర్పించారు. దాడికి ఐదు గంటల ముందు మాత్రమే కీలకనేత...తమకు దాడి చేస్తున్న ప్రాంతం గురించి చెప్పాడని ఇజ్రాయెల్‌కు పట్టుబడి టెర్రరిస్టు ఇంటారేగషన్‌లో వెల్లడించాడు.